బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోల్ కతలో జరుగుతున్న ఒక సినిమా షూటింగులో పాల్గొంటునప్పుడు నిన్న స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ఒక కీలకమయిన సన్నివేశంలో నటిస్తుండగా పక్కటెముకలకి చిన్న దెబ్బతగిలింది. వెంటనే ప్రాధమిక చికిత్స చేసారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు.
తనకు దెబ్బ తగిలిన విషయాన్ని ఆయనే ట్వీటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేసారు. ఊపిరి తీసుకోవడంలో కొంత ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఒకవేళ ఇంకా నొప్పి తగ్గకపోతే ఎక్స్ రే, ఎం.ఆర్.ఐ. స్కానింగ్ చేయించుకొంటానని తెలిపారు.
రిభు దాస్ గుప్తా నిర్మిస్తున్న “Te3N” అనే హిందీ సినిమా షూటింగు గత నెలరోజులుగా కోల్ కతలో సాగుతోంది. 1982లో కూలి అనే హిందీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అందులో హీరోగా నటించిన అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి దాని వలన ఆయన చాలాసార్లు అనారోగ్యం పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదే చోట దెబ్బ తగలడంతో ఆయన అభిమానులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 79 ఏళ్ల వయసు గల అమితాబ్ బచ్చన్ “ఇక నేను రిటైర్ అవ్వవలసిన సమయం వచ్చినట్లే ఉంది. నేను వాడుతున్న ఈ మందులు వాటి ప్రభావంతో చాలా ఇబ్బందిపడుతూ, అందరినీ ఇబ్బంది పెట్టడం కంటే రిటైర్ అవడమే బాగుంటుందేమో?” అని తన బ్లాగులో వ్రాసారు. అది చూసి ఆయన అభిమానులు ఇంకా ఆందోళన చెందుతున్నారు.