పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం ఎనిమిది మంది సైనికులు మరణించగా ఇంకా మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో శైలేష్ గౌర్ అనే సైనికుడు కూడా ఒకడు. అతను పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ విభాగం వద్ద ఆ రోజు విధులు నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులు లోపలకి చొరబడి కాల్పులు మొదలుపెట్టగానే అప్రమత్తమయిన శైలేష్ గౌర్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాడు. అతనితో పాటు అక్కడే విధులు నిర్వహిస్తున్న గురుసేవక్ సింగ్ కూడా ఉగ్రవాదులతో పోరాటం మొదలుపెట్టాడు.
ఉగ్రవాదులను నిలువరించడంలో వారిరువురూ సఫలమయ్యారు. కానీ వారిలో గురుసేవక్ సింగ్ శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోవడంతో చనిపోయాడు. శైలేష్ గౌర్ శరీరంలోకి కూడా ఆరు తూటాలు దూసుకుపోయాయి. దానితో అతను కూడా నేలకూలిపోయాడు. కానీ ప్రాణాలు కోల్పోలేదు. అంత బాధలోను తీవ్ర రక్తస్రావం అవుతున్నపటికీ శైలేష్ గౌర్ ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా తన వద్ద ఉన్న తుపాకీతో ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించకుండా నిలువరించగలిగాడు. ఈలోగా అక్కడికి అదనపు భద్రతాదళాలు చేరుకొని ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ప్రాణాలు లెక్క చేయకుండా ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసిన శైలేష్ గౌర్ ని తక్షణం మిలటరీ ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు చేసి శరీరంలో దూసుకుపోయిన తూటాలనన్నిటినీ బయటకి తీశారు. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో కోలుకొంటున్నట్లు సమాచారం. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను నిలువరించిన శైలేష్ గౌర్ దైర్యసాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. యావత్ భారతదేశ ప్రజలు ఆయన సాహసానికి, దేశభక్తికి సాల్యూట్ చేయవలసిందే.