జిహెచ్ఎంసి ఎన్నికలపై హైకోర్ట్ ఆదేశం కెసిఆర్ ప్రభుత్వ స్వయంకృతాపరాధమనే మాట అంతటా వినిపిస్తున్నది. రాజకీయంగా అనుకూలత, ఆదిక్యత సాధించుకున్న సర్కారు అత్యాశకు పోయి అభాసుపాలైందని ఆ పార్టీ ముఖ్యులు కొందరు వాపోతున్నారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నా ఎన్నికల గడువు కుదించడం వంటి పనులు చేయాల్సిన అవసరమేమిటి? ఈ నాలుగు రోజులతో ఒరిగేదేమీ ఉంటుంది…చెడ్డపేరు తెచ్చుకోవడం తప్ప..అని ఒక నేత అన్నారు.
తీర్పు రాగానే కెసిఆర్ దాన్ని గౌరవిస్తామని ప్రకటన చేయడం వలన వాళ్ళ పరువు దక్కినా అసలు ఆ పరిస్తితి ఎందుకు తెచ్చుకోవాలి? అని అయన ప్రశ్నించారు. విభజన చట్టంలో 101 వ సెక్షన్ ఇందుకోసమేనా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. అనుకులతలో అపశ్రుతి అంటే ఇదేనని మరో తెరాస నేత అన్నారు. నీరసపడిన కాంగ్రెస్ నేతల నోరు పెగలడానికి కోర్ట్ ఉత్తర్వు కారణం కాలేదా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రతిపక్షాలకు బలం ఉంటే ఎన్నికల ప్రక్రియను ఎందుకు వెనక్కు పంపిస్తున్నాయని అయన వ్యాఖ్యానించారు.
ఈ ఎదురు దెబ్బతో తమకు కాస్త ఊరట దొరుకుతుందని ప్రతిపక్షాలు ఆశపడుతుంటే, తమ గెలుపునకు డోకా లేదని తెరాస చెబుతున్నది. ఒంటరిగా మెజారిటీ రాకపోతే మజ్లిస్ తో సంప్రదిస్తామని కేటిఅర్ ఒక టీవీ చర్చలో స్పష్టంగానే చెప్పేసారు. మజ్లిస్ పై ఎలాగు ఈ ప్రభావాలు పనిచేయవు. కనుక మా విజయానికి ఇబ్బంది లేదు. రాజకీయ విమర్సల గురించి మాత్రమే దీని ప్రభావం అని తెరాస బల్లగుద్ది చెబుతున్నది. అయితే ఈ ఆదేశం తమకు అనుకూలంగా మలుచుకోగలమనే ఆశ ఇతరుల్లో కనిపిసున్నది. చివరికి ఓటర్లు తీర్పు కోసం చూడాల్సిందే.