సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఆరేళ్ళయినా ఇంకా ఆయన పేరిట నిన్నటి వరకు షర్మిల ఓదార్పు యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మరణం లేదు…ప్రజల గుండెల్లో శాస్వితంగా జీవించే ఉంటారని చెపుతూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా ఆయన పేరు చెప్పుకొని ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. వైకాపా ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేకపోవడం చేతనే ఆయన పేరును వాడుకోవలసి వస్తోందని భావించవలసి ఉంటుంది.
ఆయన పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రలతో ఆంధ్రాలో పార్టీని బాగానే బలోపేతం చేసుకోగలిగారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేసినందుకే తనను కాంగ్రెస్ పార్టీ జైలులో పెట్టిందని ఆయన చెప్పుకొంటారు. కానీ ఆ ఓదార్పు యాత్రల వలన రాష్ట్రంలో వైకాపా బలపడితే కాంగ్రెస్ పార్టీ దెబ్బయిపోతుందనే భయంతోనే జైలుకి పంపిందని దానర్ధం అని ఆయన చెప్పకనే చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భయపడినట్లే జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రల వలన రాష్ట్రంలో వైకాపా బలపడింది కాంగ్రెస్ పార్టీ దెబ్బయిపోయింది.
అయితే తెలంగాణాలో మాత్రం షర్మిల చేసిన ఆ ఓదార్పు యాత్రల వలన వైకాపా ఏ మాత్రం బలపడలేదు. బలపడదనే సంగతి వైకాపాకి కూడా తెలుసు. తెలంగాణాలో చాలా బలంగా ఉన్న కాంగ్రెస్, తెదేపా, బీజేపీలే తెరాస ధాటికి విలవిలలాడిపోతున్నప్పుడు, అసలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడానికే వెనుకాడుతున్న వైకాపా షర్మిల చేసే ఈ ఓదార్పు యాత్రలతో బలపడుతుందని ఎవరూ ఆశించలేరు. కానీ ఆమె తన అన్న జగన్ “ప్రజలకు ఇచ్చిన మాట కోసం” పట్టుదలగా తెలంగాణాలో ఓదార్పు యాత్రలు చేసి నిన్నటితో నిజామాబాద్ లోని ఆఖరి కుటుంబాన్ని కూడా ఓదార్చి తన ఓదార్పు యాత్రలను ముగించారు. అందుకు చిహ్నంగా జిల్లాలో గాంధారి గ్రామంలో వైకాపా ఒక స్థూపం కూడా ఏర్పాటు చేయబోతోంది.
కనుక నిన్నటితో ఆరేళ్లుగా సాగుతున్న ఈ ఓదార్పు యాత్రలు ముగిసిపోయినట్లే. తెలంగాణలో మొత్తం 750 కుటుంబాలను ఓదార్చినట్లు లెక్కలు తేలాయి. ఈ ఓదార్పు, పరామర్శ యాత్రలు ముగిసేలోగానే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి “రైతు భరోసా” యాత్రలను కనిపెట్టి ఆంధ్రాలో మొదలుపెట్టేశారు. కనుక మళ్ళీ ఏదో ఒక రోజున షర్మిల తెలంగాణాలో రైతు పర్మార్శ యాత్రలు మొదలు పెడతారేమో? ఇంతకీ తెలంగాణాలో షర్మిల చేసిన ఈ పరామర్శ యాత్రల పరమార్ధం ఏమిటో తెలియాల్సి ఉంది. బహుశః కొన్నేళ్ళ తరువాత ఆ పార్టీకి చెందిన నేత ఎవరో ఒకరు ఆత్మకధ వ్రాసుకొన్నపుడు బయటపడుతుందేమో?