జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు పిడిపి శాసనసభ సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకి లేఖ కూడా అందజేశారు. కానీ దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి సంతాపంగా రాష్ట్రంలో నాలుగు రోజులు సంతాపం పాటిస్తునందున, వచ్చే ఆదివారం వరకు మెహబూబా ముఫ్తీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు. కనుక అంతవరకు రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన అమలులోకి వస్తుంది. దాని కోసం గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకొంటారు. నేడో రేపో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలుచేస్తున్నట్లు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెహబూబా ముఫ్తీ పదవీ ప్రమాణం చేయగానే గవర్నర్ పరిపాలనను ఎత్తివేయబడుతుంది. అయితే ఇది రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు సాధాణంగా విధించే గవర్నర్ పాలన మాత్రం కాదని పిడిపి సీనియర్ నేత మరియు ఆ పార్టీ ఎంపి ముజఫ్ఫర్ హుస్సేయిన్ బేగ్ మీడియాకు చెప్పారు. ఇది కేవలం రాజ్యాంగ ఏర్పాటే తప్ప రాజ్యాంగ సంక్షోభం కాదని అన్నారు.