*సాంస్కృతిక పునరుజ్జీవనమే మాఫియాలకు మందు
*యువతనుఎంగేజ్ చేయగలిగితే సరదాలు తప్ప వ్యసనాలు బందు
*యాభై ఏళ్ళు వెనక్కి వెళితే ఎన్నెన్నో పరిష్కారాలు
పంట చేతికంది, ధాన్యపు రాసులు గాదెల్లో నిండి, పొలంపనుల సెలవుకాలంలో గ్రామీణుల ఆటవిడుపుగా పొట్టేళ్ళ పందాలు, కోడిపందాలు జరిగేకాలం ఇది. అయితే ఊళ్ళలో ఆ ఏంబియన్సు లేదు. ఊరికీ ఊరికీ మధ్య పోరంబోకుల్లో, గ్రామకంఠాల్లో, నీరులేని చెరువుల్ల, ఖాళీగా వున్న చేలల్లో, పోటీల చుట్టూ పెల్లుబికిన యువకుల పట్టుదలలు, నడివయసు వారి ఉత్సాహాలు ఇపుడు లేవు. మనుషుల్ని జట్లు జట్లుగా కట్టి వుంచడాని ఖాళీ వేళల్లో జరిగిన పందాలలోకి ఇప్పుడు డబ్బు చొరబడిపోయింది. స్పోర్టివ్ స్పిరిట్ లోకి జూదక్రీడ చొచ్చుకువచ్చేసింది.
కోస్తా జిల్లాల్లో పెద్ద వ్యసనంగా వున్న కోడిపందాలకోసం కోళ్ళకాళ్ళకు బంగారు కడియాలు తొడిగి,కార్లమీద మీద కోడిపందాల కేంద్రాలకు చేరుతున్నారు. ఈ సీజన్ లో కోడిపందాలను సీరియస్ గా తీసుకోనవసరం లేదని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు సూచిస్తారు. అదేసమయంలో కోడిపందాలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్ పిలు టివిల్లో చెబుతారు. సందట్లో సడేమియా అన్నట్టు సర్కిళ్ళ వారీగా పోలీసులకు కొడిపందాల నిర్వాహకులకు అనుమతి ఇచ్చి డబ్బుపుచ్చకునే సంధులు కుదురుతాయి. మరీ గేట్లు ఎత్తేస్తే చూసేవాళ్ళకి బాగోదు కాబట్టి అపుడపుడూ పోలీసు దాడుల్లో కోళ్ళతో సహా పందెగాళ్ళను పట్టుకుంటారు. అదినచ్చని రౌడీ నాయకులు ఎదురుదాడులు చేస్తారు.
ఇదంతా సాంఘిక కార్యక్రమాల నుంచి వ్యక్తులు వేరుపడిపోతున్న సంస్కృతి ఫలితం. ఇలా ఏర్పడిన సోషల్ వాక్యూమ్ లోకి డబ్బుసంపాదనే లక్ష్యంగా వున్న మాఫియాలు చొరబడిన దుష్పలితం. ముఖ్యంగా యువతరాన్ని ఒక వ్యాపకంలోకి మళ్ళించగలిగితే సోషల్ కల్చర్ తప్పక మారుతుంది. ఇది 1945 నుంచి 1960 వరకూ జరిగినట్టు చరిత్ర చెబుతోంది.
దసరా, సంక్రాంతి పండుగ రోజులలో, ప్రభాత్ భేరీ, పెద్దఎత్తున ఆటల పోటీలు, వ్యాయమ పోటీలు, నాటకాలు, విచిత్ర వేషాలద్వారా నూతన ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని యువజన సంఘాలు ప్రవేశపెట్టడంతో- యువకులు కోడిపందాలు, పేకాటల నుండి మరలి ఆరోగ్యవంతమైన ఈ కార్యక్రమాల వైపు ఆకర్షించబడ్డారు. పండుగలు జరిగినప్పుడు. యువజన మహాసభలు జరిగినప్పుడు దేశభక్తుల పేర్లతో గేట్లు నెలకొల్పేవారు. భగత్‌సింగ్ గేటు, ఠాగూర్ గేటు, జలియన్‌వాలా బాగ్ గేటు అని పేర్లు పెట్టేవారు. ఈ విధంగా వారిని జాతీయోద్యమ చరిత్రతోనూ, దేశభక్తుల త్యాగమయ జీవితాలతోనూ పరిచయం చేసి ఉత్తేజపరచడం జరిగింది.
బుర్రకథ, జముకుల కథ, గొల్ల సుద్దులు, కోలాటం, భజన, బుడబుక్కల వేషం, పకీర్లు, లంబాడీడాన్స్, అన్నాచెల్లెళ్ల సంవాదం, చెంచీత- ఒకటేమిటి? ప్రాచీన జాపనద కళా రూపాలన్నింటితో ఆనాటి ప్రజల సమస్యలు, ఇతి వృత్తాలుగా ఒక బ్రహ్మాండమైన సాంస్కృతికోద్యమం తెలుగు గ్రామసీమలను ఉర్రూతలూగించింది. జాతీయ భావం, దేశభక్తి, నిస్వార్ధ ప్రజాసేవ, ఉన్నత జీవితాదర్శాలు, ఇందులో ప్రబోధించబడేవి.
దసరా పండుగలకు విచిత్ర వేషాలు వేసేవారు. దొంగవర్తకుడు, బెంగాల్ కరువు, గాంధీ- జిన్నాల కరస్పర్శ, హిట్లరు, ముస్సోలినీలతో యుద్ధం చేస్తున్న స్టాలిన్ మున్నగు విచిత్ర వేషాలు వేలాది ప్రజలను ఆకర్షించేవి. ఈ విధంగా ఆంధ్ర దేశంలోని అనేక పట్టణాలలో, పల్లెల్లో దసరా పండుగలకు పెద్ద ఎత్తున వైజ్ఞానిక ప్రదర్శనలు జరిపి యువజన సంఘాలు ప్రజలలో అపూర్వ సంచలనం తీసుకురాగలిగాయ.
యువజన సంఘాలు నడిపిన రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా తరగతుల వలన గ్రామీణ యువకులలో విద్యా, విజ్ఞానాలు వ్యాపించాయి. గోడ వార్తాపత్రికలు, వార్తాపత్రిక పఠనకేంద్రాలు, గ్రంథాలయాలు, ఊరూరా వెలిశాయి. దళిత వ్యవసాయ కార్మిక యువకులను కూడా యువజనోద్యమంలోకి తీసుకురావడం వలన సవర్ణ యువకులలో అస్పృశ్యత పట్టింపులు సడలిపోయాయి. కులభేదాలు మరిచిపోయి అన్ని కులాల, అన్ని తరగతుల యువకులు ఆటలు, పాటలలో పాల్గొనడం ద్వారా, అంత క్రితం గ్రామకక్షలతో, కొట్లాటలతో కొట్టుమిట్టాడే గ్రామాలలో ఐక్యతాభావం, గ్రామీణ ఆరోగ్య, వైద్య, పారిశుద్ధ్య సౌకర్యాలు, మొదలైన వాటి సాధనకు ఐక్యకృషి, సామరస్యం మొలకలెత్తాయి. యువతరంలో వచ్చిన ఐక్యత- గ్రామ పెత్తందార్ల మధ్య అనైక్యతను, తగవులను సమసి పోయేటట్లు చేసిన సందర్భాలు ఆ రోజులలో అనేకం.
కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ మున్నగు జిల్లాల్లో వందలకొలది రాత్రి పాఠశాలలు యువజన సంఘాలచే నడుపబడుతూ ఉండేవి. 1935 నుండి 1945 వరకు దశాబ్దం కాలంలో ఆంధ్ర జాతీయ పునరుజ్జీవనకు జరిగిన కృషిలో ఆంధ్ర యువజనోద్యమం మహోజ్వలపాత్ర నిర్వహించింది అని ఈ చరిత్ర రుజువు చేస్తుంది.
1970 వరకూ వచ్చిన సినిమాల్లో ఈ నేపధ్యమంతా కనిపిస్తుంది. పర్సనల్ కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టిన యువతరం తీరిక సమయాల్ని ఫేస్ బుక్ కో వీడియో గేములకో, పార్టీలకో ఇచ్చేస్తున్న ప్రస్తుత వాతావరణంలో సంఘం కోసం మనుషుల్ని భౌతికంగా కూడగట్టడం కష్టమే! కాన్సెప్టులను కూడగట్టడానికి సోషల్ మీడియా శక్తివంతమైన సాధనంగా వుంది. అయితే వాటిని ఆచరణలోకి తెచ్చే మార్గాలతో మనుషుల్ని ముఖ్యంగా యూత్ ని ఎంగేజ్ చేయగలిగితే సోషల్ వ్యాక్యూమ్ తగ్గిపోతుంది. డబ్బుఆశ, అది సృష్టించే మాఫియాల ప్రభావం తగ్గుతాయి.
ఇలాంటి కల్చరల్ రినైజాన్స్ లేదా సాంస్కృతిక పునరుజ్జీనవనం అన్ని రకాల మాఫియాలను దూరంగా తరిమేస్తుంది. అపుడు కోడిపందాల నుంచి జూదం దూరమై, సమాజానికి ఆటవిడుపౌతుంది. డబ్బుతో నిమిత్తం లేని స్వచ్ఛమైన ఉల్లాసం, సంతోషం, ఆనందం మనుషుల్లోకి మళ్ళీ ప్రవేశిస్తాయి.