సినిమా అంటేనే నిజం కాదు, సినిమాల్లో చూపించేవన్నీ నిజ జీవితంలో జరిగే అవకాశాలు తక్కువ. అలాగే నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని యథాతధంగా సినిమాగా తియ్యడం కూడా సాధ్యం కాదు. సినిమా అంటేనే ఇన్ని రకాల వేరియేషన్స్ వున్న పరిస్థితుల్లో సినిమా వాళ్ళు చెప్పే మాటల్లో నిజాలు వుంటాయని అనుకోవడం కూడా తప్పే అవుతుంది. హీరోలుగానీ, హీరోయిన్లుగానీ, డైరెక్టర్లుగానీ, ప్రొడ్యూసర్లుగానీ తాము చేస్తున్న సినిమాకి సంబంధించి చెప్పే మాటల్లో ఎంత శాతం నిజం వుంటుందనేది చెప్పడం చాలా కష్టం. వాళ్ళు చెప్పేది వందశాతం నిజమైనప్పటికీ వినేవారికి మాత్రం నమ్మాలనిపించదు. అదే సినిమా అంటే.
ఇదంతా ఎందుకంటే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను రికార్డుల గురించి పట్టించుకోనని, తను ఎవరికీ పోటీకాదని, తనకి ఎవరూ పోటీ కాదని, ఆ విధంగా తను ఆలోచించడంలేదని చెప్పాడు. అలాగే కలెక్షన్ల రికార్డులను కూడా తను పట్టించుకోనని పదే పదే చెప్పాడు. ఎన్టీఆర్ చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం వుందంటారు? ఒకప్పుడు సినిమా రిలీజ్ సెంటర్స్ విషయంలోగానీ, 50 డేస్ సెంటర్స్లోగానీ అభిమానుల మధ్య చాలా పెద్ద గొడవలు జరిగేవి. అప్పట్లో చిరంజీవి కలెక్షన్లను క్రాస్ చేసేది మా ఎన్టీఆరేనని అతని అభిమానులు కాలర్ ఎగరేసి మరీ చెప్పేవారు. వారికి ఎన్టీఆర్ సపోర్ట్ కూడా వుండేదని తెలిసింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వ్యక్తిగత రికార్డుల కోసం చూసుకోకుండా టీమ్‌ని గెలిపించడమే లక్ష్యంగా ఆడే క్రికెటర్స్‌లా ఇప్పుడు మన హీరోలు ఆలోచిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు సేఫ్ అవ్వడం కోసం హీరోలు కూడా కష్టపడుతున్నారు. మొదటి రెండు వారాల కలెక్షన్సే సినిమాకి ఇంపార్టెంట్ అని చెప్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు రికార్డుల గురించి ఆలోచించడం లేదు. ఇంతకుముందు కంటే తను చాలా మారానని చెప్తున్న ఎన్టీఆర్ ఈ విషయంలో కూడా మారాడు తప్ప టాప్ హీరోగా పేరు తెచ్చుకోవాలని, అందరి కలెక్షన్ల రికార్డుల్ని క్రాస్ చెయ్యాలని అతనికి మాత్రం వుండదా?