హైదరాబాద్: నందమూరి నటవారసుడి విషయంలో చర్చకు తెర దించారు. జూనియర్ ఎన్టీఆర్. ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయంపై స్పందించారు. నందమూరి తారక రామారావులాగా మరొక వ్యక్తి ఉండరని, జన్మించరని అన్నారు. తాను ఆయన వారసుడిని కాదని, కేవలం మనవడిని మాత్రమేనని చెప్పారు. ఈ జన్మకిది చాలని అన్నారు. ప్రేక్షకులను ఒప్పించగలం అనే నమ్మకాన్ని ఏ దర్శకుడైనా కలిగిస్తే భవిష్యత్తులో సాగర సంగమం, శంకరాభరణం లాంటి సినిమాలు చేయటానికైనా రెడీయేనని జూనియర్ చెప్పారు. పౌరాణికాల్లో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని, కానీ పౌరాణికాలన్నప్పుడు తనలో ఒక భయం కూడా కలుగుతుందని అన్నారు. తాతగారితో పోల్చి చూస్తారని చెప్పారు.
సుకుమార్ ఇక్కడ ఉండాల్సినవాడు కాదని జూనియర్ అన్నారు. ఆయన ఆలోచనలు గమ్మత్తుగా ఉంటాయని చెప్పారు. ఆయననుంచి తరతరాలు చెప్పుకునే స్థాయిలో మరిన్ని సినిమాలు తప్పకుండా వస్తాయని అన్నారు. నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిదిమంది కలిసి తీసిన సినిమా నాన్నకు ప్రేమతో అని చెప్పారు. తన మైండ్ సెట్ మార్చిన దర్శకుడు రాజమౌళి అని తెలిపారు. ఆయనతో సినిమా ఎప్పుడనేది ఆయనే నిర్ణయించాలని అన్నారు. తన భార్య ప్రణతి తనకు మరో అమ్మ అని జూనియర్ చెప్పారు.