హైదరాబాద్: బాలీవుడ్ గురించి అవగాహన ఉన్నవారందరికీ అలనాటి నటీమణులు రేఖ, జయాబచ్చన్ మధ్య ఉన్న శత్రుత్వం గురించి తెలిసే ఉంటుంది. అమితాబ్ బచ్చన్‌కు రేఖతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉందని ఆ రోజుల్లో ఊహాగానాలు జోరుగా సాగేవి. వాటిల్లో నిజమెంతో, అబద్ధమెంతోగానీ అమితాబ్ ధర్మపత్ని జయకు రేఖకు మధ్య మాటలు ఉండేవి కావు. మరోవైపు వీరి ముగ్గురి మధ్య అనుబంధాన్ని కథాంశంగా తీసుకుని ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ యశ్ చోప్రా ‘సిల్సిలా’ అనే చిత్రాన్ని తీసి సంచలనం సృష్టించారు. ఆ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ కూడా.
ఇంత నేపథ్యమున్న జయ, రేఖల అనుబంధం ఇటీవల కొత్త మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన స్టార్ స్క్రీన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు… పలకరించుకున్నారు. ఆలింగనం కూడా చేసుకున్నారు. అవార్డుల కార్యక్రమం మొత్తాన్ని పక్కపక్కనే కూర్చుని చూశారు. వీరి పక్కనే ప్రస్తుత లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ కూర్చున్నారు. మొత్తానికి రేఖ-జయ ఇలా కలుసుకోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి రాజ్యసభ సభ్యురాళ్ళయిన వీరిద్దరూ కొంతకాలం క్రితం రాజ్యసభలో ఎదురుపడినా పలకరించుకోలేదు. తనకు రేఖ పక్కన స్థానాన్ని కేటాయించటంపై జయ మండిపడి, తనకు వేరే స్థానాన్ని కేటాయించాలని రాజ్యసభ ఛైర్మన్‌ను కోరారు. మరి ఇప్పుడు ఏమనుకున్నారో, ఏమోగానీ జయే ముందస్తుగా రేఖ దగ్గరకు వెళ్ళి స్నేహహస్తాన్ని సాచారు.