హైదరాబాద్: ఆ యువకుడి వయస్సు 24 సంవత్సరాలు. మెడిసన్ పూర్తయింది. సివిల్స్‌లో విజయం సాధించాడు. ఆ పరిస్థితుల్లో సగటు భారతీయ యువకుడు ఎవరయినా ఏమనుకుంటారు? లైఫ్ సెటిలయిపోయిందనుకుంటారు. ఆ యువకుడు మాత్రం అలా అనుకోలేదు. తనలాంటి అనేకమంది ఉద్యోగార్థులకు సాయపడాలనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఒక ఆన్ లైన్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. సివిల్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి, మెడిసిన్ సీట్స్ సాధించాలనుకునేవారికి, విదేశీ భాషలు నేర్చుకోవాలనుకునేవారికి కోచింగ్ ఇస్తున్నాడు.
జైపూర్‌కు చెందిన రోమన్ సైనీ జబల్పూర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. దాని పేరు అన్ఎకాడమీ. అతనికి ఈ పనిలో గౌరవ్ ముంజాల్ అనే మరో యువకుడు సాయం చేస్తున్నాడు. గౌరవ్ ఈ అన్ ఎకాడమీకి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ అన్ ఎకాడమీకి 20,000 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు… 64,000 ఫేస్ బుక్ లైక్స్ ఉన్నాయి. అన్ఎకాడమీ అప్ లోడ్ చేసిన వీడియో పాఠాలకు ఇప్పటివరకు 1.1 కోటి వ్యూస్ వచ్చాయి. వీరి పాఠాల ద్వారా 10 మంది సివిల్స్ సాధించారు. నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవటమే తమ లక్ష్యమని సైని చెప్పారు. ప్రస్తుతం కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఎకనామిక్స్, జాగ్రఫీ, బయాలజీ, లా తదితర సబ్జెక్టులపై వీడియోలద్వారా పాఠాలు అందిస్తున్నారు. ఈ పాఠాలన్నింటినీ ప్రస్తుతం ఇంగ్లీష్ లోనే బోధిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర భారతీయ భాషలలో అందించాలని యోచిస్తున్నారు. నిజంగా స్ఫూర్తిదాయకమైన కృషి!