హైదరాబాద్: ఆఫ్గనిస్తాన్ పార్లమెంట్ భవనంపై తాలిబన్ తీవ్రవాదులు ఇవాళ ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఆఫ్గన్ భద్రతాదళాలు వారిని సమర్థవంతంగా తిప్పికొట్టి ఆత్మాహుతిదళంలోని ఆరుగురు తీవ్రవాదులను హతమార్చాయి. ఉదయంనుంచి రెండుగంటలపాటు జరిగిన ఈ దాడితో పార్లమెంట్ భవనంవద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగురు తాలిబన్ తీవ్రవాదులు భవనం గేట్ వద్ద ముందు కారుబాంబును పేల్చారు. తర్వాత ఏకే-47 తుపాకులతో కాల్పులు జరుపుకుంటూ లోపలికి చొరబడటానికి ప్రయత్నించారు. భద్రతాదళాలు పార్లమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులను, జర్నలిస్టులను సురక్షితప్రాంతానికి తరలించటమే కాకుండా తీవ్రవాదులను దీటుగా అడ్డుకున్నారు. అక్కడ జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు తీవ్రవాదులు చనిపోయారు. 31మంది పౌరులు గాయపడ్డారు. పార్లమెంట్లో ఇవాళ రక్షణశాఖకు కొత్తమంత్రిగా మహమ్మద్ మాసూమ్ స్తానిక్జై నియమించబోతున్న సందర్భాన్ని నిరసిస్తూ తామే ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్ సంస్థ ప్రకటించింది.