ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశ్యంతో విశాఖపట్టణంలో రెండు రోజుల సి.ఐ.ఐ. భాగస్వామ్య సదసు నిన్న మొదలయింది. దానిలో మొదటి రోజే రూ.1,95,457 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశ, అంతర్జాతీయ సంస్థలు అంగీకరించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
వాటిలో భారత్ కి చెందిన రిలయన్స్ ఏ.డి.జి. రూ.5000 కోట్లు, భారత్ ఫోర్జ్: రూ.1400 కోట్లు, దివీస్ సంస్థ: రూ. 1250 కోట్లు మరియు అశోక్ లైలాండ్: రూ.1000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రాలో సంస్థలు స్థాపించేందుకు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన కోల్ కార్పోరేషన్ రూ.31,680 కోట్లు, ఇవి కాక మరికొన్ని ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు నిన్న ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసాయి.
వాటిలో రిలయన్స్ సంస్థ విశాఖలో రాంబిల్లి వద్ద అత్యాధునిక నౌకా నిర్మాణ సంస్థను నెలకొల్పుతుంది. దీనిలో ఇండియన్ నేవీ కోసం అత్యాధునిక నౌకలు నిర్మించబడతాయి. గుజరాత్ లోని ‘పిపవావ్’ అనే ప్రాంతంలో ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఇటువంటి సంస్థను నెలకొల్పింది.
భారత్ ఫోర్జ్ సంస్థ నెల్లూరు జిల్లాలో ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ పార్క్, అనంతపురం జిల్లాలో బహుళ ప్రయోజన డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ పరికరాలను తయారు చేసే సంస్థని ఏర్పాటు చేస్తుంది.
ఆస్ట్రేలియాకు చెందిన కోల్ కార్పోరేషన్ సంస్థ కృష్ణా జిల్లాలో 5280 మెగావాట్స్ సామర్ధ్యం గల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తుంది. అశోక్ లైలాండ్ సంస్థ కృష్ణ జిల్లాలో ఆటోమోటివ్ రంగానికి చెందిన విడిభాగాల తయారీ సంస్థను నెలకొల్పుతుంది.
నిన్న జరిగిన సమావేశానికి 1100 మంది భారత్ కి చెందిన పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, 41 దేశాల నుంచి 315 మంది విదేశీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజే మొత్తం 32 ఒప్పందాలు జరిగాయి. ఇవ్వాళ్ళ జరుగబోయే సమావేశంలో ప్రధానంగా ఐ.టి. రంగంలో సుమారు 49 ఒప్పందాలు జరుగబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
నిన్న జరిగిన సదసుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనేక మంది రాష్ట్ర మంత్రులు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, సుజానా చౌదరి పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంధి మల్లికార్జునరావు తదితర ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భారీ సంఖ్యలో వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. చివరి రోజు అయిన ఈరోజున జరుగబోయే 49 ఒప్పందాల ద్వారా ఇంకా చాలా భారీ పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.