జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ ఆకస్మిక మరణం బీజేపీకి సంకట పరిస్థితి తెచ్చిపెట్టినట్లే ఉంది. ఆ రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి)కి మద్దతు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నష్టపోయేలా ఉంది. ముఫ్తీ మొహమ్మద్ మరణించిన తరువాత ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ఆ స్థానాన్ని చేపట్టేందుకు బీజేపీ అంగీకరించింది. కానీ అందుకు ప్రతిగా తమకు ఆర్ధిక లేదా రోడ్లు భవనాల శాఖను కేటాయించాలని షరతు విధించినట్లు సమాచారం.
కేంద్రప్రభుత్వం నుండి పిడిపి సానుభూతి ఆశిస్తుంటే, ఇటువంటి సమయంలో పిడిపికి మద్దతు కొనసాగించేందుకు బీజేపీ షరతులు విధించడంపై మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన శ్రీనగర్ లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అంత్యక్రియలకు కేంద్రప్రభుత్వం తరపున హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, సహాయ మంత్రి జితేందర్ సింగ్ హాజరయ్యారు. కానీ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ డిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చినపుడు ప్రధాని నరేంద్ర మోడి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదు. ఆయన మరణించిన తరువాత సంతాపం తెలిపినప్పటికీ, కేంద్రప్రభుత్వం తరపున ఎవరినీ రాష్ట్రానికి పంపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మహబూబా ముఫ్తీకి సానుభూతి తెలుపలేదు.
ఇదే అదునుగా ఆ రాష్ట్రానికే చెందిన మాజీ కేంద్రమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతీ రోజు మెహబూబా ముఫ్తీని, పిడిపి నేతలను కలుస్తూ వారికి అండగా నిలబడ్డారు. తమ పార్టీ పిడిపికి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు పిడిపికి తెలియజేసారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా స్వయంగా రాష్ట్రానికి వచ్చి మెహబూబా ముఫ్తీకి సానుభూతి తెలిపారు. ఆమెతో బాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అంబికా సోని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.ఏ.మీర్ తదితరులు మహేబూబా ముఫ్తీని కలిసి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇంత చురుకుగా స్పందించి పరిస్థితులను తారుమారు చేయగలదని ఊహించని కేంద్రప్రభుత్వం కంగు తింది. వెంటనే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారిని రాష్ట్రానికి పంపించింది. ఆయన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సత్ పాల్ శర్మ తదితరులను వెంటబెట్టుకొని మెహబూబా ముఫ్తీని కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. కానీ బీజేపీ చాలా ఆలస్యంగా మేల్కొనడంతో పరిస్థితులు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నిన్నటితో నాలుగురోజుల సంతాప దినాలు పూర్తవగానే మెహబూబా ముఫ్తీ తన నివాసంలో పిడిపి శాసనసభ సభ్యులతో సమావేశమయ్యి తాజా పరిస్థితులు, బీజేపీ షరతుల గురించి చర్చించారు. తమకు బీజేపీ షరతులు విధించడం కాక తామే బీజేపీకి షరతులు విధించాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యవహారాలలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోకుండా తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్చనీయాలని, అలాగే రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులు మంజూరు చేయాలని కోరాలని పిడిపి నిశ్చయించుకొన్నట్లు సమాచారం. బీజేపీతో కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఇదివరకు ఇరు పార్టీలు అంగీకరించిన నిర్దిష్ట గడువులో మంత్రిత్వ శాఖల మార్పులు చేయడం, ఆరేళ్ళకొకసారి రొటేషన్ పద్దతిలో పిడిపి, బీజేపీలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమనే రెండు షరతులను తొలగించి మెహబూబా ముఫ్తీకే అధికారంలో కొనసాగడానికి అంగీకరించాలని బీజేపీకి పిడిపి ఎదురు షరతులు విదిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది కనుక బీజేపీ మద్దతు ఇక తమకి అవసరం లేదని పిడిపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే మెహబూబా ముఫ్తీ మొగ్గు చూపినట్లయితే కేవలం 9నెలల వ్యవధిలోనే బీజేపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినట్లవుతుంది.
ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో చేతులు కలిపి మహాకూటమిని ఏర్పాటు చేసి బీజేపీని చావు దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఊహించని విధంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీజేపీని మళ్ళీ దెబ్బ తీయడానికి చురుకుగా పావులు కదుపుతోంది.
నిధుల కోసం పిడిపి చేస్తున్న సరికొత్త డిమాండ్ గమనిస్తే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపితో కలిసి అధికారం పంచుకొనేందుకే ఆ రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం కారణంగానే బహుశః ప్రధాని నరేంద్ర మోడి ఆ రాష్ట్రానికి రూ.80,000 కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించారా? అనే అనుమానం కలుగుతోంది. అదే నిజమయితే పిడిపితో అధికారం పంచుకొనేందుకు మోడీ ప్రభుత్వం మళ్ళీ మూల్యం చెల్లించవలసి ఉంటుందేమో? మరో రెండు మూడు రోజుల్లోనే పిడిపి బీజేపీతో కొనసాగుతుందా లేక కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న స్నేహ హస్తం అందుకొంటుందా? అనే సంగతి తేలిపోతుంది.