సాధారణంగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఏదో ఒక అంశంపై అధికార పార్టీని సవాలు చేసి దానిపై తాము రాజీనామాకు సిద్దమని, అధికార పార్టీ అందుకు సిద్దమేనా? అని సవాళ్లు విసురుతుంటారు. కానీ తెలంగాణాలో మాత్రం భిన్నమయిన పరిస్థితి కనబడుతోంది. అధికార పార్టీకి చెందిన మంత్రి కె.టి.ఆర్. ప్రతిపక్షాలకి సవాలు విసురుతున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలవడమే కాదు మేయర్ పీఠం కూడా దక్కించుకొంటామని కె.టి.ఆర్. చాలా ధీమా వ్యక్తం చేసారు.
“మా పార్టీ మేయర్ పీఠం దక్కించుకోలేకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దం! మీరూ మీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయడానికి సిద్దమేనా? అని సవాలు విసిరారు. ప్రతిపక్షాలు ఈ సవాలుని స్వీకరించలేకపోతే ఓటమిని ముందే అంగీకరించినట్లవుతుంది. కనుక అంగీకరించవచ్చును. కానీ మేయర్ పీఠాన్ని ఎవరు కోల్పోయినా ఎవరూ రాజీనామాలు చేయరనే సంగతి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధ పార్టీల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకే ఇటువంటి సవాళ్లు విసురుకొంటాయనే విషయం ఇప్పుడు సామాన్య ప్రజలకి కూడా తెలుసు.
కానీ ఈ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో అధికార తెరాస కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం, చురుకుదనం ప్రతిపక్షాలలో కనబడటం లేదు. గత ఏడాది కాలంగా వాటి బలమయిన నేతలని ఆకర్షిస్తూ తెరాస చాలా ఘోరంగా దెబ్బ తీస్తుండటమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చును. ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఓడిపోయినట్లయితే ఇక అవి కోలుకోవడం చాలా కష్టమేనని భావించవచ్చును.