అదో మీటింగ్ హాల్. అక్కడ చేరినవారంతా దేశంలో సైన్స్ పట్ల చైతన్యం కలిగించాలన్న తపనపడుతున్నవారే. అంతలో అక్కడకు వాచ్ మన్ పరుగుపరుగున లోపలకు వచ్చేస్తూ..
`అయ్యా, ఎవరో సైంటిస్టట. వేషంగీషం చూస్తుంటే వెర్రిబాగులోడిలా ఉన్నాడు. అడవి మనిషిలా కనబడుతున్నాడు. తానూ శాస్త్రవేత్తనంటున్నాడు. పంపించమంటారా?’
`ఎవరయ్యా, ఆ సైంటిస్ట్. ఇప్పుడున్న వారితోనే సైన్స్ సదస్సులు ఎలా నిర్వహించాలా అని కుస్తీ పడుతుంటేనూ…’ అన్నాడు చైర్మన్ సీట్లో కూర్చున్న వ్యక్తి.
`పేరు అడిగితే, మూడోకన్ను తెరిచేలాగా ఉన్నాడు సార్. అందుకే భయంవేసి మీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాను’ వణికిపోతూ అన్నాడు ద్వారపాలకుడు.
`సరే, లోపలకు పంపించు…’
ఇలా అనగానే, అలా వచ్చేశాడు అపరిచితుడు. ఆకారం చూస్తుంటే పరమశివునిలానే ఉన్నాడు. చేతిలో త్రిశూలం. మెడలో నాగుపాము. ఒంటినిండా విభూతి. రుద్రాక్షమాలలు. తలపై గంగమ్మ. నంది వాహనంతో సహా వచ్చేశాడు. కోపంతో కళ్లు ఎర్రబడ్డాయి.
అక్కడ కూర్చున్న వారు ఆశ్చర్యపోయారు. వచ్చినవాడు నిజంగానే శివుడా, లేక వేషం కట్టుకుని వచ్చాడా అన్న సందేహంలో పడిపోయారు. అంతలో వారిలో ఒకతను అడిగాడు…
`అయ్యా ఏమిటీ వేషం? ఇంతకీ మీరెవరు?’
`నేనెవర్నీ?’ గట్టిగా ప్రశ్నించాడు శివుడు.
`అదేమిటీ ! మేము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే, మీరు అదే ప్రశ్న వేస్తారు. మీరెవరో మీకే తెలియదా?’ అనేక అనుమానాలొచ్చేశాయ్ చైర్మన్ కు.
`నాకు తెలియకకాదు. మీ చేష్టల వల్ల నా ఉనికే ప్రమాదంలో పడింది. తెలుసా?’ కన్నెర్ర చేశాడు శివుడు.
`అంటే..మీకు, మీరెవరో తెలుసన్నమాట. కానీ `నేనెవర్నీ ?’ అంటూ అడుగుతారన్నమాట. అర్థమైంది సార్. మీ కేసు అర్థమైంది’ అదోలా నవ్వుతూ అన్నాడు చైర్మన్.
`అంటే, నన్ను పిచ్చివాడ్నిగా భావిస్తున్నారా?’
`లేకపోతే ఏమిటండీ? చూడండి, మీరు ఇలా రావడమే తప్పు. ఆపైన నేనెవర్నీ…నేనెవర్నీ? అంటూ రెట్టించి అడగడం మరీ తప్పు. మీ వేషధారణ చూస్తుంటే చిత్రంగా ఉందే. మీ వాలకం చూస్తుంటే వేషం గట్టిన శివుడిలా ఉన్నారు’ చెబితేనేగాని అర్థంకాదన్నట్లు ఒక ప్రొఫెసర్ తనదైన శైలిలో వివరించాడు.
ఆ వెంటనే, శివుడి జటాఝూటం నుంచి గంగ ప్రవహించడం మొదలైంది. దీంతో మీటింగ్ హాలు నీటితో నిండిపోసాగింది. చూస్తుండగానే శివుడు చేతిలో అగ్ని పుట్టింది. శివుడు అంతలో అర్థనారీశ్వరునిగా కనిపించాడు. అందరికీ అర్థమైంది. వచ్చింది నిజంగానే శివుడు. వెంటనే చైర్మన్ సహా చాలా మంది చెంపలు వాయించుకుని భక్తితో నమస్కరించారు.
`నేనెవర్నీ ?’ మళ్ళీ అదే ప్రశ్న శివుడి నోటి నుంచి వచ్చింది.
`ఆఁ తెలిసింది, మీరు అర్థనారేశ్వరులు’ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అలవాటైన ఓ మేధావి అన్నాడు.
`నేను అర్థనారీశ్వరుణ్ణా, పరమ శివుడ్నా అని కాదు, ఇంతకీ నేనెవర్నీ? ‘
`మహాదేవా… దేశంలో సైన్స్ కాంగ్రెస్ పెట్టేస్తూ, జనంలో విజ్ఞానశాస్త్రం పట్ల చైతన్యం కలిగించాలని మేము తపన పడుతుంటే తమరిలా….’ చైర్మన్ సీట్లో కూర్చున్నాయన వివరణ ఇచ్చాడు.
`చూడు బట్టతలాయనా… నువ్వు కాంగ్రెస్ పెడతావో, కమ్యూనిస్ట్ అంటావో నాకెందుకయ్యా, నాకు సమధానం చెప్పు… ఇంతకీ నేనెవర్నీ? ‘ శివుడు మళ్ళీ అదే అడిగేసరికి, అక్కడ కూర్చున్నవారి బుర్రలు వేడెక్కాయి. వెంటనే వారంతా మెదడుకు పదనుపెట్టడం ప్రారంభించారు. ఎదురుగా ఉన్న శివుడు ఏదో ఆకతాయిగా ఈ ప్రశ్న వేయడంలేదని వారికి అర్థమైంది. ఇక నెమ్మదిగా తీగలాగడం ప్రారంభించారు.
`అవునండి, మేము పొరపాటు పడుతున్నాం. మిమ్మల్ని సరిగా అర్థంచేసుకోలేకపోతున్నాం. మీరు ఆది దేవులు. ప్రకృతి స్వరూపులు’ అన్నాడు చైర్మన్.
`ఇప్పుడు దారిలోకి వచ్చారయ్యా, నేను ప్రకృతి స్వరూపుణ్ణి. అవును కదా…’
`అవును స్వామి, అవును. మీరంటేనే ప్రకృతి. పంచభూతాలు మీలో ఉన్నాయి. శిరస్సు మీద గంగ, మెడలో నాగుపాము. నుదుటిమీ విభూతి రేఖలు…’ అంటూ పొగడడం మొదలుపెట్టాడు. ఎక్కడో చదివాడు శివుడు భోళాశంకరుడనీ, పొగడ్తలకు ఇట్టేపడిపోతాడని. ఎదుట నిలబడిన వ్యక్తి సాక్షాత్తు పరమశివుడని పూర్తిగా నమ్మకం కుదిరింది చైర్మన్ కు.
`ఈ ప్రకృతిని కాపాడుతున్నదెవరు?’ శివుడు అడిగాడు.
`తమరే స్వామి, కచ్చితంగా తమరే. ఇందులో ఎవ్వరికీ సందేహం లేదు’ అన్నాడు చైర్మన్. మిగతా వాళ్లంతా `నిజమే…నిజమే’ అన్నట్లు తలలూపారు.
`మరి అప్పుడెందుకు కాదన్నారు… ఇంతకీ నేనెవర్నీ ?’ హూంకరించాడు శివుడు.
మళ్ళీమొదటికొచ్చిందేమిట్రా భగవంతుడా అనుకున్న చైర్మన్. దైర్యం తెచుకుంటూ –
`అయ్యా, తమరే ప్రకృతి స్వరూపం. కాదనగలిగే ధైర్యం మాకుందా చెప్పండి. ‘ వేడుకున్నాడు.
`మరి శివుడు – పర్యావరణ శాస్త్రవేత్త కాదని ఎలా అనగలిగారు?’ సూటిగా ప్రశ్నించాడు శివుడు.
అప్పుడర్థమైంది చైర్మన్ కు. అఖిలేష్ పాండే అనే శాస్త్రవేత్త ఒక అధ్యయన పత్రం అందివ్వడం, దాన్ని తాను ఆమోదించడం, ఆ తర్వాత మీడియా నానా రభస చేయడంతో అతనికి ఎలాగో నచ్చచెప్పి, సదస్సుకు రాకుండా చేయడం, గండం గట్టిక్కిందని ఊపిరిపీల్చుకోవడం… ఇవన్నీ కళ్లముందు రీల్ లా తిరగాడింది.
`మహాదేవా. మీరు అతిగొప్ప పర్యావరణ శాస్త్రవేత్తే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు ఆమాటకొస్తే నేను మీ భక్తుణ్ణి. కార్తీకమాసంలో ప్రతి సోమవారం ఉపవాసముంటాను. ఇక శివరాత్రి వచ్చిందంటే చాలు, జాగరణే. వారానికి ఓ రోజు శివాలయం వెళ్లాల్సిందే. మిమ్మల్ని అవమాన పరుస్తానా స్వామి. అందుకేగా అఖిలేష్ పంపిన అధ్యయన పత్రాన్ని ప్రెజెంట్ చేయడానికి మొదట్లో అంగీకరించాను’
`మరి అంతలో నీ బుద్ధి ఎందుకు వక్రీకరించింది’ శివుడు త్రిశూలమెత్తాడు.
`మహాదేవ నన్ను రక్షించు. నేను నిమిత్తమాత్రుణ్ణి. ఈ మీడియా వాళ్లూ, బయట ఉన్న మేధావులు కోడిగుడ్డుమీద ఈకలు పీకేరకం. `మతాన్నీ, దేవుళ్లను తీసుకువచ్చి సైన్స్ పేపర్సంటారా’ అని కోప్పడ్డారు స్వామి. `పరమ శివుడే గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త అంటూ అధ్యయన పత్రం అతగాడు రాయడమేంటీ, మీబోటి వాళ్లు అనుమతించడమేమిటం’టూ ముక్కచివాట్లు పెట్టారు. ఇక చేసేదేమీలేక అతగాడ్ని రావద్దని నేనే వేడుకున్నాను స్వామి. అలా గండం గట్టిక్కిందని సంతోషిస్తున్నాను. ఇంతలో మీరు ఇలా…’
`అతగాడ్ని రావద్దనగానే సమస్య తొలిగిపోతుందనుకున్నావా మూర్ఖా.. ఇప్పుడైనా నిజం చెప్పండి. నేనెవర్నీ ?’
`మీ ప్రశ్న ఇప్పటికి అర్థమైంది స్వామి. మీరు పర్యావరణ శాస్త్రవేత్తల్లో ఆద్యులు. ఆదిదేవులు’
`అద్గదీ సంగతి. ఈ విషయం మీడియా వాళ్లకు చెప్పండి. అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఈ సృష్టి ఆది నుంచి పర్యావరణాన్ని సమతౌల్యం చేస్తున్నది నేనే. బయోడైవర్శిటీ..బయోడైవర్శిటీ అంటూ అంతర్జాతీయ సదస్సులు పెడతారేగానీ, జీవవైవిధ్యాన్ని నూటికినూరుశాతం కాపాడుతున్నది నా కుటుంబమే. అంటే శివ కుటుంబమే. దైవశక్తి, సైన్స్ ఒకే రకంగా ఆలోచిస్తాయి. మానవాళికే పాటుపడతాయి. రెండింటి దారి ఒకటే. అర్థమైందా..’
`అహా, ఇప్పుడర్థమైంది దేవదేవ. నీ కుటుంబాన్ని ఒక్కసారి తేరపార చూస్తే చాలు, జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అందరికీ అవగతమవుతుంది. ఓం నమఃశ్శివాయ, ఓం నమఃశ్శివాయ’ అంటుండగా కాలింగ్ బెల్ చప్పుడైంది. వెంటనే చైర్మన్ కు మెలుకొచ్చింది. కలలో కనిపించిన శివుడు చెప్పింది బోధపడినట్లు తలవూచి ఏదో చేయాలన్న సంకల్పంతో వడివడిగా బయటకువెళ్ళాడు.
– కణ్వస