విశ్లేషణ
`ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యుడు కాదు’- ఇదేదో మనవాళ్లు అంటున్నమాట కాదు. విశాఖలో భాగస్వామ్య సదస్సుకు హాజరైన విదేశీ ప్రముఖులు అంటున్నమాట. బాబు మాటల నేర్పరితనమే తమతో ఎంఓయూలపై సంతకాలు చేయించిందని దేశ, విదేశీ ప్రతినిధులు ఒప్పుకుంటున్న విషయం.
నాలుగు మంచిమాటలు చెప్పి పెట్టుబడిదారుల నుంచి లక్షల కోట్ల ప్రాజెక్ట్ లపై ఎంఓయులు ఘనంగా చేయించడాన్ని సామాన్యమైన విషయంగా కొట్టిపారేయకూడదు. అనిల్ అంబానీ అంతటాయనే `అంతా భేషుగ్గా ఉన్నద’ని ఐదువేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో డిఫెన్స్ పరికరాల యూనిట్ ఏర్పాటుచేస్తామని అనేశారు. విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు బాగానే పండింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా మాటలతోనే సంచులు నింపుకోవడం ఎలాగో బాబు చూసి అంతా నేర్చుకోవాలి. సమైక్య రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఎన్నో సమస్యలున్నాయి. రాజధాని లేదు, సరైన విద్యా సంస్థలు లేవు, మంచి కార్పొరేట్ సంస్థలు అంతకంటే లేవు. ఉద్యోగ అవకాశాలు అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన మాటల చాతుర్యాన్నే ప్రధాన `ఆకర్షణ మంత్రం’గా పఠించారు. అది ఇప్పుడు ఫలిస్తోంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. చంద్రబాబుని విమర్శిస్తున్నవారు సైతం ఈ పెట్టుబడుల అవకాశాలు చూసి నోరెళ్లబెడుతున్నారు. భాగస్వామ్య సదస్సులో రెండు లక్షల కోట్ల మేరకు పెట్టుబడులపై అవగాహన పత్రాలపై సంతకాలు చేయడం చిన్నాచితకా విషయమేమీకాదు. రిటైల్ పాలసీని ప్రకటించడంతో రిటైల్ వ్యాపార సంస్థల్లో కదలిక వచ్చింది. వాల్ మార్ట్, ఆదిత్యా బిర్లా గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలు సంబరపడిపోతున్నాయి.
ఈ సందర్బంగా చంద్రబాబు ఒక మాట అన్నారు – `దుబాయిలో అద్బుతాలను మనం ఈరోజు చూస్తున్నాం. అది ఎడారి నుంచి ఏర్పడిన స్వర్గసీమ. సవాళ్లను ఎదుర్కుని నిలిచిన సీమ అది..’ బాబు దీర్ఘదృష్టి చూస్తుంటే 2029నాటికి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచస్థాయిలోనే పెట్టుబడిదారుల స్వర్గసీమగా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమరావతి చుట్టుపక్కల 7,500 కోట్ల రుణంతో అభివృద్ధి చేయడానికి హుడ్కో అవగాహన పత్రం కుదుర్చుకుంది. మరో పక్క అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపట్ల కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలివితేటలు ఉండాలేకానీ, ఎడారిలోనైనా టీకొట్టు పెట్టుకుని బ్రతకొచ్చని అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును చూస్తుంటే ఇది అక్షరాల నిజమనిపిస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా చంద్రబాబును ఆకాశానికెత్తేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబే `బ్రాండ్’ అని ప్రశంసించారు. భాగస్వామ్య సదస్సులో 41దేశాలు పాల్గొనడమే చంద్రబాబు సాధించిన విజయం.
చంద్రబాబు కలల రాజధానిపై అనేక దేశాల పారిశ్రామిక వేత్తలు పెట్టుకున్న ఆశలు చూస్తుంటే బాబు మాటలే రాష్ట్రానికి నిజమైన `డబ్బు మూటల’నిపిస్తోంది. ఇవన్నీ సత్ఫలితాలనిస్తే అంతకంటే కావాల్సిదేముంది. మొత్తానికి చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో ధీరోదాత్త నాయకునిగా ఎదిగిపోయారు. నిస్సందేహంగా. కాకపోతే రాష్ట్ర ప్రజల్లో ఇంకా ఏమూలనో అనుమానం అలాగే ఉంది. చంద్రబాబు కలలు నిజం కావాలంటే, ఆయన ఒక్కరిలో నిబద్ధత ఒక్కటే సరిపోదు. అందరినీ ఏకత్రాటిపై సవ్యంగా నడిపించినప్పుడు ఆయన నిజమైన ధీరోదాత్తుడనిపించుకుంటాడు. మరి ఇది ఎంతవరకు సాధ్యమన్నదే అసలు ప్రశ్న.
– కణ్వస