ఇక్కడ మనం అంతగా పట్టించుకోని దేవతలు అక్కడ జపాన్ లో నిత్యపూజలందుకుంటున్నారు. ఎంతో ఘనమైన ఆలయాల్లో దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ మనవాళ్లు `బ్రహ్మకు ఆలయమేమిటీ? ఆయనకు ఆలయంలో ఉండే యోగమే లేదు. అది ఆయనగారికున్న శాపం’ అంటూ కొట్టిపారేస్తారు. కానీ అక్కడ జపాన్ లో మాత్రం బ్రహ్మదేవునికి బ్రహ్మాండమైన ఆలయాలున్నాయి. సుమారు 20 హిందూ దేవతామూర్తులకు జపాన్ లో నిత్యపూజలు చేస్తున్నారు.
ఇంద్రుడు దేవతలకు రాజు. అయినా అతగాడికి మనదేశంలో నిత్యపూజలు లేవు. జపాన్ లో ఇంద్ర, బ్రహ్మ, గరుడ వంటి దేవతలకు గుళ్లు కట్టారు. బుద్ధుడి ఆలయాలతో పాటుగా హిందూ దేవతామూర్తుల ఆలయాలు కూడా విరివిగా ఉన్నాయక్కడ. దీంతో పర్యటనకు వెళ్లే హిందువులకు తమ దేశంలో ఉన్నట్లే అనిపిస్తుంటుంది. ఇండియన్ మ్యూజియం ఆఫ్ జపాన్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో ఇలాంటి ఆసక్తికరమైన ఫోటోలు చాలానే ఉంచారు.
చదువుల తల్లి సరస్వతిమాత ఆలయాలే జపాన్ లో ఓ వందదాకా ఉన్నాయట. ఇక లక్ష్మీ, గణేష్ ఆలయాలకైతే కొదవేలేదు. మరో విశేషమేమంటే, మనదేశంలో కనుమరుగైన ఆరవ శతాబ్దికాలంనాటి `సిద్ధం’ అనే అక్షరమాల (స్క్రిప్ట్) జపాన్ లో చాలా భద్రంగా ఉండటం. ఈ అక్షరమాల ఆధారంగానే కొన్ని చోట్ల సంస్కృతం భాషను నేర్చుకోవడంలో ఉపయోగిస్తున్నారు. బుద్ధుని కథలో చోటుచేసుకున్న సుజాత పేరిట అక్కడ పాలఉత్పత్తులు అమ్ముతుంటారు. పాల ఉత్పత్తుదారులు సుజాత కథను చాలా గర్వంగా చెబుతుంటారు. బుద్ధునికి సుజాత అనే మహిళ పరవాన్నం (పంచదార, పాలు కలిపిన అన్నం) సమర్పిస్తుండేదట. భారత, జపాన్ దేశాల మధ్య సాంస్కృతిక సహజీవనం ఉన్నదనడానికి ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. జపాన్ భాషలోని అనేక పదాలకు మూలం సంస్కృతమే కావడం మరో విశేషం.