విశాఖలో నిర్వహించబడిన రెండు రోజుల సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సు నేడు ముగిసింది. దేశవిదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు స్థాపించడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాపారానికి అత్యంత అనుకూలమయిన రాష్ట్రమని ఈ సదస్సుకు హాజరయిన చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా మొత్తం 245 ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇది ఊహించిన దానికంటే దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చును. వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఈ ఒప్పందాలన్నీ ఆచరణలోకి వస్తే, రాష్ట్ర ముఖచిత్రమే పూర్తిగా మారిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.
కానీ వైకాపా నేతలు షరా మామూలుగానే ఈ సదస్సు నిర్వహణపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు ప్రభుత్వం చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాలతో చాలా ఒప్పందాలే చేసుకొంది. కానీ వాటిలో ఇంతవరకు ఏ ఒక్కటయినా ఆచరణకు నోచుకొందా? మళ్ళీ ఇప్పుడు లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలు చేసుకొన్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటోంది. ఆచరణలోకి రాని ఇటువంటి ఒప్పందాలు ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప మరెందుకూ పనికిరావు,” అని విమర్శించారు.
వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్రంలో సమస్యలను కప్పిపుచ్చుకొనేందుకే తరచూ ఇటువంటి హడావుడి ఏదో ఒకటి చేస్తుంటారు. ఇటువంటి వాటితో ప్రజల దృష్టిని మళ్ళించి, రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందిపోతోందనే భ్రమలు కల్పిస్తుంటారు. పెట్టుబడుల గురించి రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నవన్నీ కాకి లెక్కలే. సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసి ఈ సదస్సు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధించింది? ప్రజాధనం వృధా చేయడం తప్ప. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి హడావుడి చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం కంటే ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడిగి సాధించగలిగితే దాని వలన రాష్ట్రానికి ఏమయినా ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేక హోదాని ఆయన చెత్తబుట్టలో పడేస్తే, ఏదో ఒకరోజున ప్రజలు కూడా ఆయనను అదే చెత్తబుట్టలో పడేయడం ఖాయం,” అని అంబటి రాంబాబు అన్నారు.
పెట్టుబడులు, ఒప్పందాలు, వాటి అమలు విషయంలో వైకాపా లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పుకోవలసిన అవసరం ఉంది. కానీ ఇటువంటి సదస్సులు నిర్వహించడం వృధా అనే వైకాపా వాదన అర్ధరహితం. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సదస్సులు నిర్వహిస్తే దానికి అంబానీ, ఆది గోద్రెజ్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తమ విలువయిన సమయం వృదా చేసుకొని వస్తారనుకోలేము. వ్యాపార అవకాశాలు, లాభాపేక్ష లేనిదే ఏ పారిశ్రామికవేత్త ఇంత దూరం రాడు. పెట్టుబడి పెట్టదలచుకోనప్పుడు ఒటొట్టి ఒప్పందాలు చేసుకొని మీడియా ముందు నిలబడి ఫోటోలు తీయించుకోరు. ఒకవేళ అలాగా చేస్తే దాని వలన వారి వ్యక్తిగత, సంస్థ ప్రతిష్టే దెబ్బ తింటుంది. అదే జరిగితే ఆ ప్రభావం వారి షేర్ మార్కెట్ పై కూడా పడుతుందనే సంగతి అందరికీ తెలుసు. కనుక ఊరక రాయు మహానుభావులు అని ఖచ్చితంగా చెప్పవచ్చును.
అయితే ఇంతకు ముందు జరిగిన ఒప్పందాలలో ఇంతవరకు ఎన్ని ఆచరణలోకి వచ్చేయి? ఇంకా ఎన్ని పెండింగులో ఉన్నాయి? ఎందువల్ల పెండింగులో ఉన్నాయి? వంటి సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం, సదరు సంస్థలే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. ఒక ఒప్పందం చేసుకొని దానిని ఆచరణలోకి తేవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో అనేక సమస్యలు, అవరోధాలు ఎదురవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం, దానితో ఒప్పందం చేసుకొన్న సదరు సంస్థ వాటిని అధిగమించడానికి గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. వాటిలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గినా లేదా చిత్తశుద్దిగా ప్రయత్నించకపోయిన ఒప్పందాలు కాగితాలకే పరిమితమవుతుంటాయి. కనుక పెట్టుబడులు, ఒప్పందాలు, వాటి అమలు విషయంలో వైకాపా లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పుకోవలసిన అవసరం ఉంది.