తెలంగాణా ప్రభుత్వం సుమారు రూ. 27,000 కోట్లతో చేపట్టబోతున్న పలమనేరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఒకటి రెండు రోజుల్లో టెండర్లు పిలువబోతోంది. దానిని నిర్మిస్తే కృష్ణా జిల్లాలో రైతులు, పెన్నా డెల్టాలోని వ్యవసాయం దెబ్బ తింటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఊరుకొన్నారని రఘువీరా రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇకనయినా మేల్కొని తక్షణమే కృష్ణానది జల మండలికి, జాతీయ జల మండలికి అలాగే ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు వ్రాసి, తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకొనే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే రఘువీరా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చేరు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ వ్రాసారు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకి నోటు కేసులో ఇరుకొన్నందునే ఈ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నప్పటికీ మౌనం వహిస్తున్నారు. తనను తాను కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. అది సరి కాదు. తక్షణమే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలి,” అని రఘువీరా రెడ్డి డిమాండ్ చేసారు.
రఘువీరా రెడ్డి లేవనెత్తిన ఈ సమస్య, ఓటుకి నోటు కేసు ప్రభావం రాష్ట్ర ప్రయోజనాలకు కూడా హానికరంగా మారిందని స్పష్టం చేస్తోంది. కారణాలు ఏవయినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలలో జోక్యం చేసుకోవడం లేదు. అలాగే అక్కడ తన పార్టీని కూడా వదులుకొనేందుకు సిద్దపడినట్లే ఉన్నారు. అది ఆయన పార్టీకి మాత్రమే సంబంధించిన విషయం గాబట్టి ప్రజలు పట్టించుకోనవసరం లేదు. కానీ ఈ కేసు కారణంగా రాష్ట్ర ప్రయోజనాలను కూడా ప్రభుత్వం పణంగా పెట్టేందుకు సిద్దపడితే ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించకమానరు.