హైదరాబాద్: ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో ఫిర్యాదు చేశారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి రెమ్యునరేషన్కుగానూ తనకు ఇంకా రు.2 కోట్లు బాకీ ఉన్నారని, దానిని ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపించారు. నాన్నకు ప్రేమతో చిత్రం విడుదల సమయంలో ఆ రు.2 కోట్లనూ ఇస్తానని చెప్పిన ప్రసాద్ ఇప్పుడు మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ అసోసియేషన్ ఈ ఫిర్యాదును నిర్మాతల మండలికి పంపింది.
వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ఛత్రపతి, డార్లింగ్, అత్తారింటికి దారేది వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన భోగవల్లి ప్రసాద్ మగధీర చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆయనకు వివాదరహితుడిగా టాలీవుడ్లో పేరుంది. అలాంటి ప్రసాద్ పోయి పోయి పవన్ కళ్యాణ్‌తో వివాదం ఎందుకు పెట్టుకున్నారో తెలియటంలేదు. అందులోనూ ‘అత్తారింటికి దారేది’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయ్యి రు.75 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురయ్యి నెట్లో ప్రత్యక్షమవటంతో హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ రెమ్యునరేషన్‌ను రిలీజ్ తర్వాత తీసుకుంటామని చెప్పారు. అయితే సినిమా రిలీజ్ అయ్యి కనకవర్షం కురిపించినా కూడా తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ను పూర్తిగా ఇవ్వకపోవటంతో పవన్ ఫిర్యాదు చేశారని ఒక వాదన వినిపిస్తోంది. మరి దీనిపై ప్రసాద్ ఏమంటారో వేచి చూడాలి.