చిరంజీవి తన 150వ సినిమా గురించి మరీ ఎక్కువగా చర్చ జరిగేందుకు అవకాశం కల్పించడంతో దానిపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఆ భయంతోనే ఆయన తన 150వ చిత్రంగా తన కొడుకు రామ్ చరణ్ తేజ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ‘మమ’ అనిపించేసారని ఇండస్ట్రీలో టాక్. అయితే దురదృష్టవశాత్తు ‘బ్రూస్ లీ’ కూడా బోర్లాపడటంతో మళ్ళీ ఆయనపై ఒత్తిడి పెరిగిపోయింది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి నిర్ణయించుకొన్న విషయం, దానిని ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ చాలా ఏళ్ల విరామం తరువాత చిరంజీవి చేస్తున్న సినిమా కనుక సహజంగానే దానిని చాలా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. దీనిలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నయనతారను అనుకొన్నారు. కానీ నయనతార మాత్రం రెండున్నర కోట్లు ఇస్తే తప్ప సినిమాలో చేయలేనని తేల్చి చెప్పేసింది. నిజానికి ఇటువంటి మంచి అవకాశం వేరెవరయినా హీరోయిన్ కి వచ్చి ఉంటే ఎగిరి గంతేసి ఉండేవారు. చిరంజీవి పక్కన నయనతార అయితేనే చాలా బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను సంప్రదిస్తే, ఆమె మెగా ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది. దానితో ఆమె స్థానంలో వేరేవరినయినా తీసుకోవాలా.. లేక ఆమెకే రెండున్నర కోట్లు సమర్పించుకొని ‘కత్తి’ లాంటి ఆమెనే ఈ సినిమాకి హీరోయిన్ గా పెట్టుకోవాలా? అనే డైలమాలో ఉన్నారు మెగా ఫాదర్ అండ్ సన్.