జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో టిడిపి, బీజేపీలు కలిసి నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. ఈ సభకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ , తెదేపా తెలంగాణా అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి తదితర తెలంగాణా నేతలు, బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు సుజానా చౌదరి, బండారు దత్తాత్రేయ తదితరులు చాలా మంది హాజరయ్యారు.
ఊహించినట్లే ఈ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మరియు మంత్రి కె.టి.ఆర్. ని టార్గెట్ చేసుకొని తీవ్రమయిన విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి కూడా ఊహించినట్లే తెరాస-మజ్లీస్ బందం గురించి ప్రస్తావించి, మజ్లీస్ కారణంగా హైదరాబాద్ గూండాయిజం, మతోన్మాదం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కనుక తెరాసకి ఓటేస్తే మజ్లీస్ కి ఓటేసినట్లేనని అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి పధకాలకి కేంద్రప్రభుత్వం కూడా నిధులు అందిస్తోందని, కానీ ఆ విషయం ప్రజలకి చెప్పకుండా అంతా తామే చేస్తున్నట్లుగా తెరాస ప్రభుత్వం చెప్పుకొంటోందని అన్నారు. టిడిపి-బీజేపీ కూటమికే ఓటేసి గెలిపించినట్లయితే తాము కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి హైదరాబాద్ ని వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చేరు.
నారా లోకేష్ మొదటి నుండి చివరి దాకా చాలా తడబడుతూనే ప్రసంగం కొనసాగించారు. తమ పార్టీకి కార్యకర్తలే బలమని, వారి కారణంగానే నేటికీ తెలంగాణాలో పార్టీ బలంగా నిలబడి ఉందని, అందుకు వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని చెపుతూ తన ప్రసంగం మొదలుపెట్టారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని చేతలలో చూపిస్తే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలలో చూపిస్తున్నారని ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా గత 19 నెలల పాలనలో కేసీఆర్ చేసిన హామీలను ఒకటొకటిగా ప్రజలకు గుర్తు చేసి వాటిలో ఎన్ని అమలు చేసారో చెప్పాలని ప్రజలను కోరారు. తెదేపా-బీజేపీల మధ్య కొన్ని బేధాభిప్రాయాలున్నాయని, కానీ వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఆయన ఇటు పార్టీల నేతలకి పిలుపునిచ్చేరు. ఈ ఎన్నికలలో విజయం సాధించి టిడిపి, బీజేపీల జెండాలు ఎగురవేయాలని, అదే 2019 ఎన్నికలలో రెండు పార్టీల విజయానికి పునాది అవ్వాలని ఆకాంక్షించారు.
ఇక ఈ సభకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యి ప్రసంగించారు. కానీ ఆయన కూడా ఊహించినట్లే తన ప్రసంగంలో ఎక్కడా తెరాస పార్టీ, తెలంగాణా ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొరపాటున కూడా విమర్శ చేయకుండా జాగ్రత్తపడ్డారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో హైదరాబాద్ నగరాన్ని తను అభివృద్ధి చేయడానికి పడిన కష్టం గురించి చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి తను చేస్తున్న కృషి, ప్రధాని నరేంద్ర మోడి భజనతో సరిపెట్టేసారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు, పార్టీ బాధ్యతలు, కేంద్రంతో పనుల వలన తీరిక లేకపోవడం చేతనే హైదరాబాద్ కి ఇదివరకులా తరచూ రాలేకపోతున్నానని చెప్పుకొచ్చేరు. 2019లో జరుగబోయే ఎన్నికలకి ఈ గ్రేటర్ ఎన్నికలతోనే బలమయిన పునాది వేసుకోవాలని పార్టీ నేతలకి పిలుపునిచ్చేరు.