గ్రేటర్ హైదరాబాద్ పై గులాబీ జెండా ఎగురకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సవాల్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉంది కాబట్టే అలా చాలెంజ్ చేశారని గులాబీ శ్రేణులు సంబర పడుతున్నాయి. ఎన్నికల వేళ ఎన్నో రకాల ఎత్తులు వేయాలి. మైండ్ గేమ్ తో సొంత కేడర్ లో జోష్ నింపాలి. అవతలి వారిని మానసికంగా దెబ్బకొట్టాలి. ఈ వ్యూహంలో భాగంగానే కేటీఆర్ ఈ ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది.
గ్రేటర్ వార్డులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి, పాతబస్తీ. అక్కడ ఎం.ఐ.ఎం. పార్టీదే హవా. రెండోది, సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో ఉన్న శివారు ప్రాంతం. ఇక్కడ తెరాస కంటే టీడీపీ, బీజేపీకే బలం ఎక్కువనే అంచనాలున్నాయి. మూడోది, సీమాంధ్రులు, మైనారిటీలు ఎక్కువగా లేని ప్రాంతం. ఇలాంటి డివిజన్లు నగరం మధ్యలో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి.
రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం 40 నుంచి 45 సీట్లను ఎం.ఐ.ఎం. గెల్చుకునే అవకాశం ఉంది. 2009లో ఆ పార్టీ 43 డివిజన్లు గెల్చుకుంది. ఇక, 60 నుంచి 70 డివిజన్లలో సీమాంధ్రుల ఓట్లే కీలకమని భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ అధిక సీట్లను గెలవవచ్చని అంచనాలు వేస్తున్నారు. మిగిలిన డివిజన్లలో అత్యధికం తెరాస ఖాతాలోకి వెళ్లవచ్చని కొందరు లెక్కలు వేస్తున్నారు.
ఈ అంచనాలు కచ్చితంగా నిజమవుతాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. బరిలోకి దిగిన తర్వాత సీన్ మారిపోవచ్చు. కొందరు సీమాంధ్రులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆ ఓటు బ్యాంకును దక్కించుకోవాలనే తెరాస వ్యూహం ఫలిస్తే అంచనాలు తారుమారు కూడా కావచ్చు. అయితే, తెరాస నేతలు, శ్రేణుల్లో చాలా మందికి గెలుపుప అనుమానాలున్నాయి. టీడీపీ, బీజేపీలను ఎదుర్కొని మెజారిటీ సీట్లను గెలవ గలమా అని కొందరు నాయకులు అంతర్గత చర్చల్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడేటప్పుడు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే, కేడర్ లో జోష్ నింపడానికి, ప్రత్యర్థులను డైలమాలో పడేయడానికి కేటీఆర్ సవాల్ చేసి ఉంటారని కొందరు పరిశీలకుల విశ్లేషణ. నామినేషన్ల ఘట్టం మొదలయ్యే వేళ, కేడర్ లో అనుమానాలను పటాపంచలు చేయాలంటే ఓ బలమైన అస్త్రాన్ని సంధించాలి. కేటీఆర్ అదే పని చేసినట్టు కనిపిస్తోంది. ఓ వైపు మెజారిటీ సీట్లు గెలుస్తామని, మరోవైపు గ్రేటర్ పైగులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ప్రకటించారు. దాదాపు 50 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర కోఆప్టెడ్ సభ్యుల బలం, అవసరమైతే ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తెరాస నాయకత్వం ఇప్పటికే స్కెచ్ వేసిందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే గులాబీ జెండా ఎగిరింది కదా అని చెప్పుకోవచ్చు. అయితే మెజారిటీ సీట్లు గెలవకపోతే మాట నిలబెట్టుకుంటారా అనేది ప్రశ్న.
ఒకవేళ తెరాస ప్రభుత్వ పనితీరు ప్రజలకు నచ్చి, ఆ పార్టీ వ్యూహాలు పనిచేసి, మెజారిటీ సీట్లు కారు పార్టీ కైవసం చేసుకుంటే అది కేటీఆర్ రాజకీయ చతురతకు నిదర్శనం అవుతుంది. తండ్రి బాటలో వ్యూహ రచనా దురంధరుడిగా పేరు తెచ్చుకుంటారు. అన్నిటికీ మించి, గులాబీ కేడర్ లో ఉత్తేజం నింపడంలో మాత్రం ఆయన ఇప్పటికే సఫమైనట్టు కనిపిస్తోంది.