జి.హెచ్.ఎం.సి. ఎన్నికల సందర్భంగా టిడిపి, బీజేపీలు కలిసి హైదరాబాద్ లోని నిజాం కాలేజి మైదానంలో శంఖారావం పేరిట ఒక భారీ బహిరంగ సభను నిన్న నిర్వహించాయి. దానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్రమంత్రులు, రెండు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తడబడుతూ ప్రసంగం మొదలుపెట్టారు. ఆ తడబాటు చివరిదాక కనిపించింది.
పార్టీని కాపాడుకొంటున్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు అంటూ ప్రసంగం మొదలుపెట్టిన నారా లోకేష్, మొట్టమొదటే తమ రాజకీయ ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డి తరచుగా వాడే ‘మడమ తిప్పకుండా పోరాడుతున్న’ అనే పదం ఉపయోగించారు. అదేమీ పెద్ద పొరపాటు కాదు కానీ అటువంటి కొన్ని పదాలు వాడగానే దానికి సంబందించిన వ్యక్తులు, పార్టీలు టక్కున గుర్తుకు వస్తారు.కనుక అటువంటి పదాలను వాడకుండా ఉంటేనే మంచిది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో తన తండ్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను పోల్చుతూ రాజధాని కోసం తన తండ్రి 33,000 ఎకరాలు సేకరించారని చెప్పడం కూడా అసందర్భంగానే ఉంది. రాజధాని భూసేకరణ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు ఎదుర్కొందో, ఇంకా ఎన్ని ఎదుర్కొంటోందో తెలిసి ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందికరమయిన అంశాలను ఇటువంటి చోట ప్రస్తావించకుండా ఉండాల్సింది.
హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళనం చేసి అందులో మినరల్ వాటర్ నింపుతానని కేసీఆర్ ప్రకటించేరని కానీ ఆపని ఇంతవరకు కూడా చేయలేకపోయారని కేసీఆర్ ని విమర్శిస్తూ, అదే తన తండ్రి చంద్రబాబు నాయుడు అయితే పట్టిసీమ ప్రాజెక్టును కేవలం 16నెలల్లో పూర్తి చేసి చూపించారని నారా లోకేష్ గొప్పగా చెప్పుకొన్నారు. అయితే పట్టిసీమ విషయంలో టిడిపికి మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా విమర్శిస్తున్నప్పుడు, దానిలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పుడు దాని గురించి ఇటువంటి చోట ప్రస్తావించడం వలన తెలంగాణాలో ప్రతిపక్షాలకు తమను విమర్శించేందుకు మంచి అవకాశం కల్పించినట్లే అవుతుంది తప్ప దాని వలన ప్రజలకు మంచి సంకేతం పంపినట్లు అవదు.
హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ ప్రకటించిన అనేక పధకాలను పేరుపేరునా నారా లోకేష్ ప్రస్తావించి, వాటిలో ఎన్నిటిని ఇంతవరకు అమలు చేసారని కేసీఆర్ ని సభాముఖంగా ప్రశ్నించారు. ఆయన లేవనెత్తిన అంశాలు అన్నీ చాలా ముఖ్యమయినవే కానీ నారా లోకేష్ గొంతులో తడబాటు, గొంతులో ఆవేశం కొరవడటం కారణంగా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. అదే ప్రశ్నలను రేవంత్ రెడ్డి పులిలా గర్జిస్తూ అడిగినప్పుడు సభకు హాజరయిన ప్రజల నుండి మంచి స్పందన కనబడటం గమనిస్తే, నారా లోకేష్ బహిరంగ సభలలో ప్రసంగాలు చేయడంలో శిక్షణ తీసుకొంటే మంచిదనిపిస్తుంది. అలాగే సభలో ప్రసంగిస్తున్నప్పుడు, స్థానిక సమస్యల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసినట్లయితే ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి హైదరాబాద్ సభలో మాట్లాడటం వలన ప్రజలలో వ్యతిరేక భావన ఏర్పడే అవకాశం ఉంటుందని గ్రహించాలి.