సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం విక్రమ్, శంకర్ల కాంబినేషన్లో రూపొందిన ‘ఐ’ చిత్రం కోసం ఎంతో కూరియాసిటీతో ఎదురుచూశాయి. ఇక ఆడియన్స్ విషయం వేరే చెప్పక్కర్లేదు. ఇంకేముందు మరో అద్భుతమైన విజువల్ వండర్‌గా ‘ఐ’ వచ్చేస్తోందని ఎదురుచూసిన ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయే సినిమా ఇచ్చాడు శంకర్. ఆ షాక్ నుంచి కోలుకోకముందే విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన ’10 ఎండ్రత్తుకుల్లా’ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. తమిళ్‌తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని తెలుగు రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు పోటీలు పడ్డారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా తమిళ్లో హిట్ అయితే తెలుగులో కూడా మురుగదాసే రిలీజ్ చేద్దామనుకున్నాడు. అక్కడ ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మురుగదాస్.
తను ప్రాణం పెట్టి చేసిన ‘ఐ’, ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ’10 ఎండ్రత్తుకుల్లా’ చిత్రాలు వరసగా పరాజయాల్ని చవి చూడడంతో మూడో సినిమాగా ఆనంద్ శంకర్ డైరెక్షన్లో తమీన్స్ ఫిలింస్ పతాకంపై శిబు తమీన్స్ నిర్మిస్తున్న ‘ఇరు ముగన్’పైనే విక్రమ్ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు విక్రమ్ చెయ్యని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో అతన్ని చాలా స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట ఆనంద్ శంకర్. డిసెంబర్, 2015లో ప్రారంభమైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. విక్రమ్ సరసన నయనతార, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం హేరిస్ జయరాజ్ అందిస్తుండగా, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. 85 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంతోనైనా విక్రమ్ హిట్ కొడతాడేమో చూడాలి.