జి.హెచ్.ఎం.సి. ఎన్నికల సందర్భంగా టిడిపి, బీజేపీలు కలిసి నిన్న హైదరాబాద్ లోని నిజాం కాలేజి మైదానంలో నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభకి హాజరయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన ఆకర్షణగా నిలిచేరు. అందుకు కారణం అందరికీ తెలుసు. ఆ కారణం ఏమిటో ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. తను ఎక్కడికీ పారిపోలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో తీరిక లేకపోవడం చేతనే హైదరాబాద్ రాలేకపోతున్నానని చెప్పుకొన్నారు. కానీ అది నిజం కాదని అందరికీ తెలుసు. మళ్ళీ అందుకు రుజువులు కూడా ఆయన ప్రసంగంలోనే చాలా ప్రస్పుటంగా కనిపించాయి.
సాధారణంగా ఎన్నికల ప్రచార సభ అంటేనే అధికార పార్టీ, ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఎక్కడా పొరపాటున కూడా తెలంగాణా ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ తెరాసపై చిన్న విమర్శ కూడా చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అంతే కాదు ప్రభుత్వాలుగా సహకరించుకొంటామని నోరు జారి మళ్ళీ సర్దుకొని మోడీ ప్రభుత్వంతో సహకరించుకొంటామని చెప్పుకొన్నారు.
ఇటువంటి కీలకమయిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు తమ రాజకీయ ప్రత్యర్ధ పార్టీ-తెరాసని విమర్శించకపోవడం వలన, ఆయన గురించి ప్రజలు, ప్రత్యర్ధ పార్టీలు చెప్పుకొంటున్న మాటలే నిజమనే భావన ప్రజలకి కలగడానికి దోహదపడినట్లయింది.నేటి నుండి కాంగ్రెస్ పార్టీ, వైకాపా, మజ్లీస్ తదితర పార్టీలు ఆయన ప్రసంగంపై విమర్శలు గుప్పించడం మొదలుపెడితే, టిడిపి నేతలు వాటికి సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి కూడా ఎదురవవచ్చును.
ఈ సభలో ఆయన సమక్షంలోనే రేవంత్ రెడ్డి, నారా లోకేష్ తో సహా అందరూ తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీవ్రంగా విమర్శిస్తుంటే ఆయన మౌనం వహించడం, తన ప్రసంగంలో తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించకుండా చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తపడటం రెండూ పరస్పర విరుద్దంగా ఉన్నాయి. కనుక అయన స్వయంగా విమర్శించకపోయినా, తన సమక్షంలోనే మిగిలినవారు విమర్శిస్తున్నప్పుడు మౌనం వహించడం అంటే వాటికి ఆయన ఆమోదం ఉన్నట్లే భావించవలసి ఉంటుంది. కనుక తెరాస నేతలు కూడా ధాటిగా ప్రతివిమర్శలు చేయడం తధ్యం.
అన్నిటికంటే దయనీయమయిన విషయం ఏమిటంటే (చంద్రబాబు నాయుడుతో సహా) ఈ సభలో మాట్లాడిన తెదేపా నేతలందరూ చంద్రబాబు నాయుడు ఎక్కడికి పారిపోలేదని గట్టిగా నొక్కి చెప్పవలసిరావడం. ప్రజల సందేహాలు, అపోహలు తీర్చే ప్రయత్నంలో వారు ఆవిధంగా చెప్పుకోవడం ద్వారా ప్రజలలో ఆ అనుమానాలు, అపోహలు ఇంకా పెంచినట్లయింది. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఇదివరకులాగా తెలంగాణా ప్రభుత్వ వైఖరిని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని గట్టిగా విమర్శించి ఉండి ఉంటే ఆ అనుమానాలు, అపోహలు పటాపంచలు అయ్యేవి. కానీ తెదేపా నేతల సంజాయిషీలు, స్వోత్కర్శతో కూడిన ఆయన ప్రసంగం ప్రజలలో నెలకొని ఉన్న ఆ అనుమానాలు, అపోహలని ఇంకా పెంచడానికే తోడ్పడ్డాయని చెప్పవచ్చును. అంతకంటే ఈ సభకు ఆయన హాజరు కాకపోయుంటేనే ఇటువంటి ఇబ్బందికరమయిన సమస్య తప్పించుకోగలిగి ఉండేవారేమో?