ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర నాలుగో రోజుకి చేరింది. ఈ యాత్ర మొదలుపెట్టాక తొలి శుక్రవారం వచ్చింది! అంటే, పాదయాత్రకు తొలి విరామం. ప్రతిపక్ష నేత ప్రతీ శుక్రవారం కేసుల విషయమై విచారణకు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, ఓపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న రోజునే, పాదయాతకు తొలి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.ఇక, రాబోయే ఆరు నెలలూ పరిస్థితి ఇలానే ఉంటుంది. సరే.. ఈ సందర్భంగా తొలి నాలుగు రోజుల పాదయాత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… ఆర్నెల్లపాటు సాగాల్సిన యాత్రకు కావాల్సినంత సరంజామా వైకాపా అధినేత దగ్గర సరిపోయేంత ఉందా అనే అనుమానం కొంతమందికి కలుగుతోంది. సరంజామా అంటే… అధికార పార్టీపై చేయాల్సిన విమర్శలు, వైకాపా అధికారంలోకి రాగానే ఫలానావి చేస్తాం అంటూ ఇచ్చే హామీల జాబితా.
గడచిన నాలుగు రోజుల్లో జగన్ మాట్లాడుతున్న అంశాలు ఒకేలా ఉంటున్నాయి. ప్రారంభ సభలో చెప్పిన అంశాలే, తొలివారాంత సభలో కూడా మాట్లాడారు. తన ప్రసంగంలో కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం అవుతూ.. అవే రిపీట్ చేస్తున్నారు. వాటిలో మొదటిది.. పక్కా ఇళ్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఎవరికైనా పక్కా ఇళ్లు ఇచ్చారా అంటూ ప్రజలను ప్రశ్నించడం, వారిని రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా అనాలి అని చెప్పడం! మరో ఏడాదిలో వైకాపా అధికారంలోకి వచ్చేస్తుందనీ, ఆపై ఏ గ్రామానికి తాను వెళ్లినా ఇళ్లు లేనివారు చేతులు పైకెత్తండీ అంటే ఒక్కటి కూడా పైకి లేవకుండా చేస్తానని చెప్పడం. ఇక, రెండోది.. పెన్షన్లు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు సరిగా పెన్షన్లు ఇవ్వడం లేదనీ, తాను అధికారంలోకి రాగానే రూ. 2000 చేస్తాననీ, ఈలోగా చంద్రబాబు పెంచేస్తే, దాన్ని రూ. 3000 చేస్తానని అంటున్నారు. మూడోది.. రుణమాఫీలు, డ్వాక్రా రుణాలు. చంద్రబాబు హయాంలో రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ కాలేదనీ, రైతులకు బ్యాంకుల వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు. మరో ఏడాదిలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తే రైతులకు వ్యవసాయం పండుగ చేస్తానంటున్నారు. ఇక, నాలుగోది.. ప్రత్యేక హోదా తెస్తానని కూడా చెప్తున్నారు. మరోటి.. దశలవారీగా మద్యపానం నిషేధం, ఇంకోటి నవరత్నాల ప్రచారం! ఇవే ముఖ్యంగా రిపీట్ అవుతున్న అంశాలు.
వీటితోపాటు ఇన్ స్టంట్ హామీలకు లెక్క ఉండటం లేదు. నాలుగో రోజు యాత్రలో.. రోగులకు చికిత్స కోసం డబ్బులతోపాటు, ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకునే సమయానికి కూడా డబ్బులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే.. అది గవర్నమెంట్ గానీ, ప్రైవేటుగానీ.. ఆ కుటుంబానికి నెలకి రూ. 1,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ ఫీజు ఎంతైనాగానీ.. మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. అంతేకాదు, విద్యార్థులు మెస్ ఛార్జీలు, లాడ్జింగ్ చార్జీలకు కూడా ఏడాదికి రూ. 20 వేలు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఇన్ స్టంట్ హామీలు చాలానే ఇచ్చుకుంటూ పోతున్నారు. అంటే, వచ్చే ఆర్నెల్లపాటూ ఇవే రిపీట్ చేసుకుంటూ పోతారా అనే అనుమానం కలుగుతోంది. అదే జరిగితే పాదయాత్రపై ప్రజల్లో ప్రత్యేకమైన ఆసక్తి అంటూ ఉంటుందా..? మరి, ఆర్నెల్లపాటు ప్రజల్లో ఉండబోతున్న జగన్.. కనీసం రోజుకో అంశం మీద ప్రసంగించడానికి పరిమితం అయినా కొంత బాగుంటుంది. ఎలాగూ చాలా సమయం ఉంది కదా. అంతేగానీ, ప్రతీరోజూ అన్ని అంశాలనూ టచ్ చేసేస్తుంటే… ఇదేదో రొటీన్ అనే ఫీలింగ్ ప్రజలకు వచ్చేస్తుంది కదా. ఆర్నెల్లకు సరిపడా సరంజామా ఇదేనా..? వారి దగ్గర ఇంకా ఏదైనా ఉందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఆరునెలలపాటు జగన్ నడవడం ఒకెత్తు అయితే.. అదే సమయంలో ప్రతీరోజూ ప్రజలను ఎంగేజ్ చేసుకునే విధంగా ప్రసంగాలు తీర్చిదిద్దుకోవడం కూడా ఒక సవాలే అనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికైతే నాలుగో రోజుకే జగన్ ప్రసంగంపై ఒక రొటీన్ భావన కొంతమందిలో కలుగుతోందని చెప్పక తప్పదు!