తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందన్న పాజిటివ్ వాతావరణం రావడానికి రేవంత్ రెడ్డి చేరిక కూడా ఓ కారణం. తాను టీడీపీని వీడుతున్నదే కేసీఆర్ పై రాజీలేని పోరాటం సాగించేందుకు అని ఆయనే చెప్పుకున్నారు. కొడంగల్ గల్లీలో తేల్చుకుందాం అంటూ అధికార పార్టీని సవాల్ చేశారు. ఈ సవాలును తెరాస అధినాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కొడంగల్ ఉప ఎన్నికకు అధికారంగానే సిద్ధమౌతోంది. రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం స్పీకర్ కు అందిన వెంటనే ఆమోదించేసి, ఉప ఎన్నికకు వెళ్లాలనే పట్టుదల తెరాసలో రోజురోజుకీ ఎక్కువౌతోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొడంగల్ నియోజక వర్గం గురించి చర్చించడం విశేషం. ఆ నియోజక వర్గంలో తెరాస బాధ్యతల్ని అధికారికంగా మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఈ సందర్భంగా కొడంగల్ కు చెందిన కొంతమంది నేతలు తెరాసలో చేరారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి హరీష్ రావు ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నారు! కొడంగల్ నియోజక వర్గంలో నెలరోజులపాటు మకాం వేయబోతున్నారు. ప్రతీ గ్రామానికీ, ప్రతీ ఇంటికీ ఆయన వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నెలరోజుల్లో గ్రామస్థాయి నేతల్ని తెరాసలోకి చేర్చుకోవడం, ప్రభుత్వ పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ఉప ఎన్నిక జరిగినా సీఎం కేసీఆర్ ఆయనకే బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలేంటో హరీష్ కు బాగానే తెలుసు. అందుకే, ఇప్పుడు కొడంగల్ నియోజక వర్గంలో ఏకంగా నెలపాటు బస చేయబోతున్నారు.
ఈ ఉప ఎన్నికను తెరాస చాలా సీరియస్ గా తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. రేవంత్ ను సార్వత్రిక ఎన్నికల వరకూ ఉపేక్షిస్తూ పోవడం అధికార పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే, కొడంగల్ ఎన్నికను ముందుగా జరిపించేసి, సాయశక్తులా ప్రయత్నించి రేవంత్ ఓడించాలని భావిస్తున్నారు. దీని ద్వారా తెరాసకు కొత్త ఊపు రావడంతోపాటు, రేవంత్ దూకుడు తగ్గుతుంది. దాంతో కాంగ్రెస్ మీద పై చేయి సాధించినట్టు అవుతుంది. ఆ తరువాత, సార్వత్రిక ఎన్నికలకు వెళ్తే తెరాస విజయానికి ఢోకా ఉండదనే వ్యూహంలో ఉన్నారు. అందుకే, ఉప ఎన్నిక కసరత్తును ఈ స్థాయిలో మొదలుపెడుతున్నారు. అయితే, రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం ఇంకా స్పీకర్ కు చేరలేదు! చేరిన వెంటనే ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి, సాంకేతికంగా ఉప ఎన్నికకు ఎలాంటి అడ్డంకులు ఉండవనే అధికార పార్టీ భావిస్తోంది. ఏదేమైనా, రేవంత్ ను ఓడిస్తే చాలు అనే బలమైన నిర్ణయంతో అధికార పార్టీ ఉప ఎన్నికకు సిద్ధమైపోతోంది.