టి.ఆర్.ఎస్.ను తిరుగులేని రాజకీయ శక్తి అని వారు అభివర్ణించుకుంటారు. ఉద్యమ సమయంలో పుట్టిన ఈ పార్టీ… గతంలో ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించారు. కాంగ్రెస్, టీడీపీలను టార్గెట్ చేసుకుని రాజకీయంగా ఎదగనీయకూడదన్న ఎత్తుగడలో భాగంగానే జంపింగులకు ఊతమిచ్చారనడంలో సందేహం లేదు. తెరాసలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే… టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలామంది ఉన్నారు. కొందరు మంత్రులయ్యారు కూడా. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడాన్ని ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. పైపైకి ఇదంతా బలుపుగానే కనిపిస్తున్నా, రానురానూ పార్టీకి ఇదో సమస్యగా మారుతుందనేందుకు ఈ పరిణామం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
దశాబ్దాలుగా పార్టీ జెండానూ అజెండానూ మోస్తున్నవారు తెరాసలో ఉన్నారు. ఉద్యమ సమయం నుంచీ ఉన్న నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శ చాలారోజుల నుంచీ ఉన్నదే. అయితే, ఇలాంటి అసంతృప్తులు ఇన్నాళ్లూ తెరచాటున ఉన్నాయే తప్ప, దానికొక నిరసన రూపం ఎప్పుడూ రాలేదు! కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన కొంతమంది తెరాస జిల్లాస్థాయి సీనియర్ నేతలు, కొందరు కార్యకర్తలు ఎంపీ వినోద్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దశాబ్దకాలంగా పార్టీకి కట్టుబడి ఉంటే, తమకు ప్రాధాన్యత దక్కడం లేదనీ, కొత్తగా వచ్చినవారికే పదవులూ కాంట్రాక్టులూ అంటూ పెద్ద పీట వేస్తున్నారనీ, చివరికి పార్టీ సమావేశాల్లో సభల్లో కూడా తమకు గౌరవం దక్కకుండా చేస్తున్నారనీ, కొత్తగా చేరినవారికే ముందు వరుసల్లో ప్రాధాన్యత ఇస్తూ, తమను వెనక్కి నెట్టేస్తున్నారంటూ వినోద్ ముందు సీనియర్లు గోడు వెళ్లగక్కుకున్నారు.
ప్రస్తుతానికి ఇదో చిన్న సంఘటనగానే కనిపిస్తున్నా… తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొంతమంది సీనియర్లు ఇలా ఐకమత్యంగా నిరసన వ్యక్తం చేయడం ప్రత్యేకంగానే చూడాలి. ఎన్నోయేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉంటున్న కొందరు సీనియర్లు ఇలా బయటపడటం విశేషం. అయితే, ఈ సమావేశం ద్వారా వారు తెరాస అధినాయకత్వానికి ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. పార్టీలో ఇలాంటి అసంతృప్తి ఒకటి రాజుకుంటోందనే విషయం, సీనియర్లకు దక్కాల్సిన కనీస గౌరవం దక్కడం లేదన్న ఆవేదనను కేసీఆర్ కు తెలిసేలా చేయడం ఈ భేటీ వెనక ఉన్న ఉద్దేశం. తమ గోడు ఎంపీ వినోద్ దగ్గర వెళ్లగక్కుకుంటే, అది కేసీఆర్ వరకూ చేరుతుందని వారి ఆలోచనగా తెలుస్తోంది. ఎడాపెడా తెరాస ప్రోత్సహించిన ఫిరాయింపుల సైడ్ ఎఫెక్ట్ గా కూడా దీన్ని చూడొచ్చు. మరి, దీన్ని అధికార పార్టీ ఎలా పరిగణిస్తుందో చూడాలి!