ప్రతిపక్ష నేత జగన్ కేసులతో సంబంధం వున్న వ్యాపార వేత్తల పేర్లు ప్యారడైజ్ పేపర్లలో వున్నాయన్నది నిజం. దాని ఆధారంగా అధికార తెలుగుదేశం పార్టీ జగన్పై దాడి తీవ్రం చేయడం నిజం. అయితే గతంలో హెరిటేజ్ డైరెక్టర్ పేరు కూడా వచ్చిందని వారు ఎదురు దాడి చేయడమూ సహజమే. ఆ తర్వాత జగన్ తనపై ఆరోపణలు నిరూపించడానికి పదిహేను రోజుల సమయం ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాలు చేయడం కేవలం వ్యూహాత్మకమే. ఎందుకంటే లక్షల పత్రాలలో ప్రస్తావనకు వచ్చిన పేర్లు వందల సంఖ్యలో వున్నాయి. వాటిని పరిశీలించడానికే చాలా సమయం కావాలి. పైగా సిబిఐ కేసులు నడుస్తున్నప్పుడు ఇంత తొందరగా వాటిని అవుననీ కాదని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దత కూడా వుండదు. నిర్దోషిగా నిరూపించుకోవాల్సింది మీరేనని టిడిపి మంత్రులు ప్రకటనలు చేయడంతో వారు చేతులెత్తేశారని వైసీపీ మరో ప్రచారం మొదలుపెట్టింది. సాక్షి ఛానల్లో నన్ను మిత్రులు కొమ్మినేని అదే ప్రశ్న వేశారు. ఎందుకంటే కేసులతో ప్రమేయం వున్నవారి పేర్లు వున్నాయి. కాని జగన్ పేరే వున్నట్టు టిడిపి చెబుతున్నది. అందులో నేరుగాపేర్లున్న బిజెపి నేతల సంగతి మాట్లాడ్డం లేదు. అందుకే ఉభయుల వాదనలూ రాజకీయ ప్రచారానికే పనికి వస్తాయని నేను సమాధానం చెప్పాను. ఇక జగన్ ఆస్తుల స్వాధీనం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఇప్పుడు వార్తలు వచ్చాయి. స్వాధీనం చేసుకుంటామని ఒకప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనలు నాకు గుర్తున్నాయి. అది జరిగే పని కాదని అప్పట్లోనే చెప్పాను. స్వాధీనాల సంగతి అటుంచి కొత్తగా ఒక్క వాదన గాని ఆధారం గాని ఈ మూడేళ్లలో సమకూర్చింది లేదు. కేవలం ఆరోపణలపై వాదోపవాదాలు తప్ప వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు.