ఎపిలో బిజెపి ఎన్నికల అవకాశాలు నామమాత్రమైనా పోటీ చేయాలని ముచ్చటపడేవారికి ఒక ధర్మ సంకటం పట్టుకున్నది. తమకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు వుంటుందా లేదాఅని స్పష్టత రావడం లేదు. వైసీపీతో కూడా పొత్తు వుండే అవకాశాలున్నాయని చాలామంది బిజెపి నేతలు భావిస్తున్నారు. జగన్ మాటలే గాక బిజెపి అధిష్టానం సంకేతాలు కూడా గజిబిజి పెంచుతున్నాయి. ఇది టిడిపిని ఇరకాటంలో పెట్టడానికే కావచ్చు కాని ప్రభావం ఆ పార్టీ నేతలపై పడుతున్నది. వంటరిగా తాము చేయగలిగింది లేదని ఆ నేతలు ఒప్పుకుంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వంటరిగా వెళ్లే రిస్కు తీసుకోడని నమ్ముతున్నారు. కాని ఆ మాట తమ జాతీయ నాయకుల నుంచి రాకపోవడంతో ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదో ఒక పొత్తు వుంటుందనే ధోరణిలో కొనసాగుతున్నారు. ఇక ఆ పార్టీలోని ఇరు వర్గాలు అంటే చంద్రబాబు అనుకూల వ్యతిరేక వర్గాలు ఎవరి జోస్యాలు వారు చెబుతున్నారు. అసలు రాష్ట్ర అద్యక్షుని ఎన్నికే జరుపుకోలేని దుస్థితికి ఎంతగానో వాపోతున్నారు.