హడావుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బయటకి వచ్చేశారు! అంతే హడావుడిగా ఆయన ఢిల్లీ వెళ్లి, రాహుల్ గాంధీతో కాంగ్రెస్ కండువా కప్పించేసుకున్నారు. ఇంకా హడావుడిగా, రాష్ట్రానికి తిరిగి వచ్చి మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చేశారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మరీ కలిశారు. ఏ పరిస్థితుల్లో తాను పార్టీలోకి వచ్చానో అనేది వివరించడంతోపాటు… అందరితో కలిసి ప్రయాణిస్తా అనే సంకేతాలు ఇచ్చారు. అంతే, ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి హడావుడి గ్రాఫ్ మెల్లగా కిందికి పడిపోయిందని చెప్పాలి! ఓ నాలుగైదు రోజులుగా ఆయన హడావుడి తగ్గించేశారు. విచిత్రం ఏంటంటే.. మీడియా కోరితే ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు! కొద్దిరోజులు పోయిన తరువాత మాట్లాడుతూ అంటూ తప్పుకుంటున్నారు. ఎవరైనా కార్యకర్తలు, నేతలు చేరికలు ఉంటే.. రొటీన్ కబుర్లే చెబుతున్నారు. అయితే, ఇది తాత్కాలిక వ్యూహాత్మక మౌనంగా అనిపిస్తోంది!
కాంగ్రెస్ లో రేవంత్ చేరారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ కు రాబోతున్న పదవి ఏంటీ..? పార్టీ ఆయనకు ఇవ్వబోతున్న ప్రాధాన్యత ఏంటనే అంశంపై ఇంకా హైకమాండ్ స్పష్టత ఇవ్వలేదు. తనను ఒక ప్రత్యేకమైన నాయకుడిగా గుర్తించాలని రేవంత్ కోరుకోవడం సహజం. ఆ గుర్తింపు పార్టీ వైపు నుంచి అధికారంగా వచ్చే వరకూ కొన్నాళ్లు మౌనంగా ఉండాలని భావిస్తున్నట్టున్నారు! పార్టీలో చేరిన దగ్గర నుంచీ హడావుడి చేసుకుంటూ, అధికార పార్టీపై విమర్శలు పెంచుకుంటూ వెళ్తే… ఇతర నేతలతో సమానంగానే ఆయన్ని అధిష్టానం చూసే అవకాశం ఉంటుంది కదా. అందుకే, తాను ప్రత్యేకం అనే సంకేతాలు హైకమాండ్ నుంచి వస్తే… అప్పుడు కాంగ్రెస్ లో ఇతర నేతలు రేవంత్ ను రిసీవ్ చేసుకునే విధంలో కొంత తేడా ఉంటుంది కదా! రేవంత్ ఆశిస్తున్నది ఇదే అని విశ్లేషకుల అభిప్రాయం.
త్వరలోనే రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. వరంగల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో రేవంత్ కు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యతపై రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీలో ఆయన పదవి ఏంటనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. సో.. రాహుల్ సభ అయిన తరువాత రేవంత్ మరింత ఉత్సాహంగా తన కార్యాచరణ మొదలుపెడతారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. రాహుల్ సమక్షంలో పదవీ ప్రకటన ఉంటే, పార్టీలో తన ప్రాధాన్యత ఇదీ అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుండదు కదా! సో.. ఈ వ్యూహంతోనే ప్రస్తుతం తన సహజ ధోరణి అయిన హడావుడిని కాస్త తగ్గించుకున్నారని తెలుస్తోంది. ఇదంతా వ్యూహాత్మక మౌనంగానే చూడాలి.