తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి వెళ్లిపోవడంతో ఎవరైనా రిలాక్స్ ఫీలయ్యారంటే… అది కచ్చితంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ అని చెప్పొచ్చు! ఇన్నాళ్లూ రేవంత్ కారణంగానే పార్టీలో ప్రముఖంగా మారలేకపోయాననే అంతర్మథనం రేవంత్ నిష్క్రమణతో బయటపడ్డట్టయింది! రేవంత్ వెళ్లిపోవడంతో పార్టీకి పట్టిన దెయ్యం వదిలిందనీ, ఇప్పుడు కాంగ్రెస్ ను పట్టుకుందని ఈ మధ్య ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజా వ్యాఖ్యలు ఏంటంటే… కాంగ్రెస్ లో చేరిన తరువాత రేవంత్ రెడ్డి స్థాయి దారుణంగా దిగజారిపోయిందనీ, నాయకుడి నుంచి కార్యకర్తకు పడిపోయారని విమర్శించారు. కొడంగల్ లో రేవంత్ ను దెబ్బ కొడతామంటున్నారు. త్వరలోనే కొడంగల్ లో సభ నిర్వహించి, పార్టీ జెండా పాతుతామని చెబుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి రాజీనామాపై కూడా కొంత గందరగోళం సృష్టించేలా రమణ మాట్లాడటం విశేషం!
తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి ఇంకా రాజీనామా చేయలేదని ట్విస్ట్ ఇచ్చారు! రాజీనామా పత్రాన్ని ఆయన ఎవరికో ఇస్తే తమకేంటి సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి సమర్పించానని రేవంత్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబుకు ఎలాంటి లేఖలూ అందలేదు అంటున్నారు! మీడియాకు విడుదల చేసిన రాజీనామా పత్రాలను ఎవరికి పంపించారో తమకు తెలీదని చెబుతున్నారు. దీంతో రేవంత్ రాజీనామాపై కొంత గందరగోళం సృష్టించే పనిలో రమణ ఉన్నారని అర్థమౌతోంది.
నిజానికి, రేవంత్ రాజీనామా పత్రాలపై మొదట్నుంచీ కొంత స్పష్టత లోపిస్తున్నదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడుని కలిసిన తరువాత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, స్పీకర్ ఫార్మాట్ లోనే పత్రాలను తయారుచేసి… ఆ కాపీలను మీడియాకు కూడా రేవంత్ విడుదల చేశారు. చంద్రబాబుకు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చానని ఆయన చెప్పారు. అయితే, అవి ఇంకా చంద్రబాబు వరకూ చేరలేదని కొందరు అంటున్నారు! చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి రాజీనామాలు పత్రాలు రేవంత్ ఇచ్చారనీ, అవి ఇంకా అధినేత వరకూ వెళ్లలేదనే అభిప్రాయం కూడా ప్రచారంలో ఉంది. వాటిని చంద్రబాబు పరిశీలించి, స్పీకర్ కు పంపిస్తారని చెబుతున్నారు. మొత్తానికి, రేవంత్ రాజీనామా పత్రాలపై టీడీపీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఈయనేమో ఇచ్చేశా అంటున్నారు, ఆయన ఎవరికి ఇచ్చారో తెలీదంటూ ఎల్. రమణ ట్విస్ట్ ఇస్తున్నారు. రేవంత్ రాజీనామా చేయలేదని చెబుతున్నారు. ఈ గందరగోళంపై టీడీపీ అధినాయకత్వం స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది.