ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష వైసీపీ బహిష్కరించడం విమర్శలకు గురవుతున్నది. అయితే వారు లేకపోతే హాయిగావ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అనేక మంది ప్రత్యక్ష పరోక్ష వ్యాఖ్యలు చేయడం విశేషం. సభా వ్యవహారం ఏకపాత్రాభినయంలా వుందని కూడా పత్రికలు శీర్షికలిచ్చాయి. ప్రభుత్వంపై వైసీపీ వారు విమర్శలు కొనసాగిస్తూనే వున్నారు. కాని విచిత్రంగా ప్రభుత్వంలో భాగమైన బిజెపి కూడా ఇలాటి విమర్శలే ఎత్తుకున్నది. వైసీపీ లేకపోయినా సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆవేదనాగ్రహాలు వెలిబుచ్చారు. అన్నీ అధికార పక్షం వారు తమలో తాము చూసుకుంటున్నారే తప్ప బిజెపిగా లేవనెత్తిన అంశాలను పట్టించుకోవడం లేదని సమయం ఇవ్వడం లేదని విష్ణుకుమార్ రాజు తీవ్రంగానే వ్యాఖ్యానించారు. అంతకంటే ఆసక్తికరమైందేమంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా తాము మిత్రపక్షమైనప్పటికీ ప్రతిపక్షమేనని అన్నారు. సభలో ఏ అంశంలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో సభ్యులు నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా కేంద్రంలోని తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిధులను కూడా రాష్ట్రం తమవిగా చెప్పుకుంటుందని ఆరోపించారు కూడా.