తెలంగాణ లో కొత్త పార్టీకి బీజం పడనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతును కూడగట్టుకోనుంది. మిగిలిన పార్టీల కన్నా మిన్నగా బహుశా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి కంట్లో నలుసు గా మారనుంది.
తెలంగాణ జేఏసీ నేత ప్రో.కోదండరాం శనివారం మాట్లాడిన మాటలు విన్న పరిశీలకుల్లో ఇలాంటి అభిప్రాయం నెలకొంది. జె ఏ సీ ఆధ్వర్యంలో ఈ నెల 30 న తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ యువతకు ఉద్యోగల కల్పన ప్రభుత్వ భాధ్యత అని స్పష్టం చేశారు. కొలువుల కోసం కొట్లాట సభ తర్వాత కూడా కొనసాగుతుoదన్నారు. వచ్చేనెల 9, 10 తేదీలలో నల్గొండ లో యాత్ర చేపడతామని చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలు బాగోలేవని కోదండరాం అభిప్రాయ పడ్డారు. ఒక కొత్త రాజకీయ వేదిక రావాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనిపై చర్చిస్తున్నాం అన్నారు. వేదిక అనే పదం జె ఏ సీ చాలాసార్లు ఉపయోగించిన్నదే అయితే అది కొత్త రాజకీయ పార్టీ అంటూ కోదండరాం పేర్కొనడం గమనార్హం. ఈ నేపధ్యంలో తెలంగాణ లో కొత్త పార్టీ అనివార్యంగా అవతరించనుందనే అభిప్రాయం బలపడింది.