సినిమా రంగమూ రాజకీయ రంగమూ కూడా ఎత్తులు జిత్తులతో నడిచేవే. ఈ రెండూ కలగలసి పోతే మరెంత మాయగా వుంటుందో వూహించవలసిందే. ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ప్రచారం లభిస్తాయో చెప్పడం కష్టం. ఆ కల్పించడం వెనక ఎవరున్నారో అర్థం కావడం మరీ కష్టం. పవన్ కళ్యాణ్ పూర్వపు భార్య రేణుదేశాయ్ ఇటీవల మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిపై పవన్ అభిమానులనేవారు ధ్వజమెత్తగా ఆమె తనను తాను సమర్తించుకున్నారు. మరో వైపున ఆమెకు కొన్ని టీవీ షోలు మాత్రమే గాక సినిమాలలో పాత్రలు కూడా వస్తున్నట్టు సమాచారం. తాజాగా ఆర్కే ఓపెన్ హార్ట్‌లో రేణు వ్యాఖ్యలు కొన్ని పరిశీలకులను ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ పై రాజకీయ పోరాటం అవసరమైతే అక్కరకు వస్తారనే అంచనాతో ఒక్కసారిగా ఆమెకు ఇంత ఫోకస్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఆమె పవన్‌పై చాలా వరకూ సానుకూల వ్యాఖ్యలే చేస్తుంటారు. పిల్లల పోషణకు భారీగా డబ్బులు ఇచ్చారనే మాటలను మాత్రం సున్నితంగా తోసిపారేశారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే సంకల్పం కూడా వెల్లడించారు. అందులో తప్పేమీ లేకున్నా పవన్ అభిమానుల పేరిట జరిగిన దాడి ఇప్పటికి సద్దుమణిగింది.కాని ఆమె చెప్పే మాటలు కొన్ని ఎన్నికల రంగంలో అక్కరకు వస్తాయని పవన్ వ్యతిరేకులు భావిస్తున్నారట. కాని ఆయన ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వుంటారనేది ఇంకా అస్పష్టంగానే వుంది. దీనికి ఆయన ఒక గడువు పెట్టుకున్నారట. అదేమిటో మరోసారి చూద్దాం. అయితే ఈ కథలన్నీ నిజమేనా అంటే సినిమా రాజకీయం కలగలసిన మాయా లోకంలో ఏం చెప్పగలం?