వైసీపీ అధినేత జగన్ యాత్ర తో పాటే తెదేపా నేతల విమర్శల యాత్ర కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఛానెల్స్ లో జగన్ యాత్ర కన్నా మిన్నగా తమ విమర్శలు ప్రాధాన్యత దక్కించుకునేలా తెదేపా నేతలు కాస్త దూకుడు గానే ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ప్యార డైజ్ పేపర్ల ఉదంతం వీరికి ఆసరాగా మారింది.
ఈ నేపధ్యంలో మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా జగన్ పై ధ్వజమెత్తారు. ప్యార డైజ్ పేపర్ లలో జగన్ అవినీతి బయట పడిందన్నారు. దీనిపై సీబీఐ, సీబీటీడీ దృష్టి పెట్టాలన్నారు. కొత్త కేసుగా దీనిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని అన్నారు.
జగతి పబ్లికేషన్స్ కు పెట్టుబడులు క్విడ్ ప్రోకో అని ఇప్పటికే తేలిందని అంటున్న యనమల జగన్ లాంటి అవినీతి పరుడు రాజకీయాల్లో ఉండకూడదు అనేదే ప్రజల సంకల్పం అన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేందుకె జగన్ రాజకీయాల్లో ఉన్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. మరోవైపు మంత్రి నారాయణ కూడా వైసీపీ పై విమర్శల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ట పోయేలా అవినీతి కి పాల్పడిన నేతకు చెందిన పార్టీ ని ప్రజలు అడ్రసు లేకుండా చేస్తారని స్పష్టం చేశారు.