ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రపై ఒకవైపున టిడిపి సీనియర్ నేతలూ మంత్రులూ దాడి చేస్తుంటే మరోవైపున ఆయన గిట్టని మీడియా ప్రతికూల కథనాలు వండి వారుస్తున్నది. మామూలుగా అధికార పార్టీ కార్యక్రమాలను నిశితంగా పరిశీలిస్తూ విమర్శనాత్మక వార్తలు ఇవ్వడం పరిపాటి. ప్రతిపక్షంపై ఆ స్థాయిలో కేంద్రీకరణ వుండదు.నచ్చితే ప్రచారం లేదంటే విస్మరించడం జరుగుతుంటుంది. కాని జగన్ యాత్ర విషయంలో అందుకు భిన్నంగా జరుగుతున్నది. వైఎస్,చంద్రబాబులు పాదయాత్ర చేసినప్పుడు ఏవైనా శారీరక సమస్యలు వస్తే సానుభూతితో చూపించేవారు. ఇప్పుడు జగన్కు నడుము నొప్పిరావడం కూడా రాజకీయ కోణంలో ప్రచురించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడే నడుం నొప్పి వస్తే అంత యాత్ర ఎలా చేస్తారని ప్రశ్నలు గుప్పించడం జరుగుతున్నది. కొత్తలోనే ఇలాటివి వచ్చి తర్వాత శరీరం సర్దుబాటు కావడం దైనందిన జీవితంలోనే చూస్తుంటాం. లేదంటే విశ్రాంతి తీసుకుంటారు. అంతేగాని దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరముండదు. ఇక ఆయన అభిమానులకూ చుట్టూ వుండే భద్రతా సిబ్బందికి ఘర్షణ జరిగిందని మరో వార్త. అదే నిజమైతే జగన్ యాత్ర ప్రజలను బాగా ఆకర్షిస్తున్నట్టు అర్థం. అందుకే ఆయన దగ్గరకు వెళ్లడానికి వారు హడావుడి పడుతున్నారన్నమాట.ఇప్పుడు ఒక ఎంఎల్ఎ అలకబూనారని తాజా వార్త.పాదయాత్ర ప్రభావశీలంగా లేకపోతే ఆ ఎంఎల్ఎ అసలు పట్టించుకోకుండా పక్కకు తప్పుకునే వాడు కదా! ఇలాటి వార్తలతో అనుకోకుండానే ప్రతికూల మీడియా ఆయనకు అధికతర ప్రచారం ఇస్తుందన్న మాట.