స్వామీ పరిపూర్ణానంద ఇటీవల చేస్తున్న ప్రసంగాలూ వీర హిందూ విన్యాసాలు ఆరెస్సెస్ సంఘ పరివార్ను మించి పోతున్నాయి. రోజూ ఆయన సోషల్ మీడియాలో ఆయన వూగిపోతూ మాట్లాడుతున్నారు. అడపాదడపా మీడియాతో మాట్లాడుతున్నారు. ఆచెప్పింది పత్రికల్లో టీవీల్లో కొద్దిగా వచ్చినా సోషల్ మీడియాలో పూర్తిగా పోస్టు చేస్తారు. సర్వమత సామరస్యం చెప్పవలసిన సాధుపుంగవుడైన ఆయన రాష్ట్రీయ హిందూ సేన అంటూ స్థాపించి రాజకీయాలే మాట్టాడుతున్నారు. అసహనంతో ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. దీనంతటిపై ఆరెస్సెస్ బిజెపి నేతలు తమదైన వివరణ ఇస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ క్రైస్తవ మత ప్రార్థనలు చేస్తుండడంతో ఆయనను ఎదుర్కొవడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే పరిపూర్ణను మొదట చాలా ఎక్కువగా ప్రోత్సహించారు. తము అనలేనివి ఆయనతో అనిపించారు. కాని తర్వాత రాజకీయం మారిపోయింది.మోడీ ప్రభుత్వం వచ్చాక హిందూత్వ వాదనలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికే పరిపూర్ణానంద తంటాలు పడుతున్నారు. మాకన్నా ఎక్కువగా మాట్లాడుతున్నారు.మొదట బాగా బలపర్చాము గాని ఇప్పుడు అంతగా జోక్యం చేసుకోవడం లేదు. లేకుంటే ఆయన తనే ప్రత్యామ్నాయ హిందూసేనను స్థాపించడమేమిటి? యుపిలో యోగి ఆదిత్యనాథ్ లాగా తను కూడా ముఖ్యమంత్రి కావాలని ఆయన కోర్కె గనక రాజకీయాల్లోకి రావచ్చు. అంతేగాని సన్యాసిని అంటూనే రాజకీయ ఆవేశాలెందుకు? అని మరో నాయకుడు విమర్శించారు.అయితే ఆయన మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన ప్రణాళిక ప్రకారమే ముందుకు పోతున్నారు. ఆగేట్టు లేరు. పైగా చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కూడా పరిపూర్ణను బాగానే ఆదరిస్తున్నారు ఇన్నివైపుల నుంచి వత్తాసు లభిస్తుంటే ఆయన ఎందుకు వెనక్కుపోతారు? అయితే ఎంత ప్రయత్నించినా ఎపి తెలంగాణలు యుపిగా మారబోవని మాత్రం స్వామివారు తెలుసుకోవలసి వుంటుంది.