చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి షూటింగ్ ఎప్పుడు? ఈ సినిమాఎప్పుడు క్లాప్ కొట్టుకోనుంది? చిరు అభిమానులు ఆసక్తిగా చర్చించుకొంటున్న సంగతులివి. ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. డిసెంబరు 6 నుంచి ‘సైరా’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కళా దర్శకుడు రాజీవన్ నేతృత్వంలో హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. ఆ సెట్ పనులు పూర్తి కావొచ్చాయి. మరోవైపు కెమెరామెన్ రత్నవేలు కూడా డిసెంబరు మొదటి వారంలో ఖాళీ అవుతున్నాడు. అందుకే డిసెంబరు 6న ‘సైరా’కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెలాఖరుకి ‘రంగస్థలం’ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కాస్త ప్యాచ్ వర్క్ ఉన్నా… రత్నవేలు అవసరం లేకుండానే ఆ పనులన్నీ జరిగిపోతాయి. అందుకే.. డిసెంబరు మొదటివారంలో ‘సైరా’ ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నయనతార ఓ కథానాయికగా ఎంపికైంది. మరో పాత్రలో అనుష్క కనిపించబోతోందని తెలుస్తోంది. అనుష్క ఎంట్రీ ఖాయమా, కాదా అనే విషయం ఇంకొద్ది రోజుల్లో తేలిపోనుంది. డిసెంబరు 6 నుంచి 15 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరిపి, సంక్రాంతి తరవాత మరో కొత్త షెడ్యూల్ మొదలెట్టే ఆలోచనలో ఉంది చిత్రబృందం. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.