ఆఫర్లమీద ఆఫర్లు ఇస్తున్న బట్టల షాపుల్లో తప్ప సంక్రాంతి సందడి కనిపించడం లేదు. సెట్టింగులు వేసి షూటింగులతీసే టెలివిజన్లలో తప్ప సంక్రాంతి సంస్కృతి కనిపించడంలేదు.
ఈ ఏడాది సంక్రాంతిలో కళా కాంతులు మసకేసిపోడానికి కారణం ప్రజల కొనుగోలు బాగా సన్నగిలిపోవడమే. కొనుగోలు శక్తుల్లో (రాష్ట్రాల రాజధానులూ, మెట్రో నగరాలూ మినహా) దేశంలో నే 9 వస్ధానంలో వున్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా పండగ అమ్మకాలు బాగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 60 శాతం పడిపోయాయని రాజమండ్రిలో టివిలు, ప్రిజ్ ల వంటి గృహోపకరణాలు, గాడ్జెట్లు అమ్మే ఎల్ జి సంస్ధ డీలర్ జూపూడి పార్ధసారధి చెప్పారు. అరిసెలు సున్నుండల వంటి సంక్రాంతి ప్రత్యేక వంటకాలను ఇంటిలో తయారు చేసి అపార్టు మెంట్లలో సరఫరా చేసే గుత్తికొండ నాగరాజు” మా కస్టమర్లు 10 శాతం పెరిగారు. ఆర్డర్లు మాత్రం 45 శాతం పడిపోయాయని” వివరించారు.
గత ఏడాది రెండోపంట దెబ్బతినడం, ఈ ఏడాది మొదటి పంట ఒక భారీ వర్షానికి, రెండు తుపానులకూ నాశనమవ్వడంతో గోదావరి జిల్లాల్లోనే నష్టం దాదాపు 4 వేల కోట్లరూపాయల వుంది. అంటే ఈ మేరకు డబ్బు – మార్కెట్ లో చెలామణి కాలేదు. ఆమాంద్యం ఇపుడు బయటకు కనబడుతోంది.
సంక్రాంతి అంటే గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మైలురాయి. వ్యవసాయానికి మాత్రమే గాక వ్యవసాయానికి అనుబంధంగా వున్న పనులు, వృత్తుల వారి ఆర్ధిక స్ధితిగతులకు ఒకప్పుడు వ్యక్తీకరణగా వున్న సంక్రాంతి ప్రాభవం, వ్యవసాయ రంగమే చితికిపోవడం వల్ల కొడిగట్టిపోతూండటంలో ఆశ్చర్యంలేదు.
పశుసంపద హరించుకుపోవడంతో పశుపోషకులు అవసరంలేకుండాపోయింది. టివిలు రావడంతో ప్రజల్ని ఎంటర్ టెయిన్ చేసిన గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, హరిదాసులు, జంగం దేవరలు…..మొదలైన వృత్తుల వారు వేరేపనులలోకి వలసలు పోయారు. అయితే తరతరాలుగా వస్తున్న పండుగలో జవసత్వాలు ఉడిగిపోతున్నా సంక్రాంతి ఆనవాలు చెరిగిపోలేదు. ఎంటర్ టెయిన్ మెంట్ టివి చానళ్ళు ఆ ఆనవాళ్ళకు తమ సృజనాత్మకతను కలిపి సంక్రాంతిని రీకన్స్ట్రక్ట్ చేసి మనకి చూపిస్తున్నారు.
ఇపుడు పాతికేళ్ళలోపు వారికి సంక్రాంతి అంటే టివిలో కనిపించేది మాత్రమే!