హైదరాబాద్: ‘క్రీమ్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో 80వ దశకంనాటి దక్షిణాది హీరో హీరోయిన్లు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌లాల్, ప్రభు, సుహాసిని, కుష్బూ, లిజి, రాధ, అంబిక, రాధిక తదితరులందరూ ఒక గ్యాంగ్‌లాగా ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరానికొకసారి వారు చెన్నైలో ఒకచోట కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా జరిగిన ఒక ఘటనను బాలకృష్ణ ఇవాళ ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
వ్యక్తిగత హోదాలన్నీ మర్చిపోయి సరదాగా గడపాలని ఒకచోట కలుస్తామని, ఒక సారి ఇలా కలిసినప్పుడు అందరితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగుతుంటే, సుహాసిని వచ్చి “బాలా వచ్చేయ్… కిందకు” అని అన్నట్లు బాలయ్య చెప్పారు. ఏమిటని అడిగితే, “రజనీ సార్ వచ్చారు” అని సుహాసిని అన్నారని, అందరం ఒకటనుకుని కలిస్తే, తేడాలు చూపించేసరికి తనకు సర్రున కోపం వచ్చిందని చెప్పారు. “రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్?” అని తాను అరిచినట్లు తెలిపారు. “ఫోటో తియ్యండి” అన్నానని చెప్పారు. ఫోటోలు అయ్యాకే కిందికి వెళ్ళానని తెలిపారు.
నిజజీవితంలో నటించటం తనకు చేతకాదని, పెద్ద విషయాలకన్నా చిన్న చిన్నవాటికే తనకు కోపమొస్తుందని బాలయ్య చెప్పారు. తాను పర్ఫెక్షనిస్ట్నని, తనచుట్టూ అందరూ అలానే ఉండాలనుకుంటానని, లేకపోతే కోపమొస్తుందని అన్నారు. తనలో క్షమించేగుణం తక్కువేనని చెప్పారు. ఏ విషయంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే క్షమించనని అన్నారు. బుజ్జగించటంలాంటివి తనకస్సలు లేవని చెప్పారు. ఏదైనా ఒక్కసారేనని, తన స్టైల్లోనే డీల్ చేస్తానని అన్నారు. వాళ్ళకు రెండో అవకాశం ఇవ్వనని చెప్పారు. అక్కడితో కటాఫ్ అయిపోతుందని అన్నారు. ఇంట్లోవాళ్ళయినా, బయటివాళ్ళయినా అంతేనని చెప్పారు. వందో సినిమా విషయంలో బోయపాటి శ్రీను మార్చి నాటికి రెడీగా ఉంటే సరేనని, లేకపోతే మరొకరితో తీస్తానని, ఆగలేనని బాలయ్య అన్నారు. తన భార్య వసుంధర గురించి చెబుతూ, 1982లో తమ పెళ్ళయిందని, తనను ఇంతకాలం భరించిన భార్య ఆవిడని చెప్పారు.