పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మన్సూద్ అజహార్ ని పాకిస్తాన్ పోలీసులు బుదవారం అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ కి చెందిన ‘డాన్ పత్రిక’ పేర్కొంది. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో గల జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కార్యాలయాలపై ఈరోజు పోలీసులు దాడులు చేసి అనేక మందిని అరెస్ట్ చేసి దాని కార్యాలయాలకు తాళాలు వేసినట్లు ఆ పత్రికలో పేర్కొంది. భారత్ అందించిన అనుమానితుల జాబితా ఆధారంగా ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.
ఈ దాడికి పాల్పడినవారి గురించి మరిన్ని వివరాలు అందించాలని పాకిస్తాన్ కోరుతోంది. భారత్ అనుమతించినట్లయితే ఈ కేసుపై దర్యాప్తు కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన జాయింట్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ పఠాన్ కోట్ సందర్శించి, మరిన్ని ఆధారాలు సేకరించాలనుకొంటున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దర్యాప్తును స్వయంగా రోజూ సమీక్షిస్తున్నారు. ఈరోజు మౌలానా మన్సూద్ అజహార్ ని అరెస్ట్ చేసిన తరువాత పాక్ ఆర్మీ జనరల్ రహీల్ షరీఫ్, ఐ.ఎస్.ఐ. చీఫ్ లెఫ్టినెంట్ జెనెరల్ రిజ్వాన్ అక్తర్ తో సమావేశమయినట్లు పాక్ మీడియా పేర్కొంది.