ప్రశాంత్ కిషోర్ – ఈ పేరు ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో తెగ వినిపిస్తోంది. వైసిపి లో ఈయనే కొత్త పవరాఫ్ సెంటర్ అనీ, జగన్ సీనియర్లని కాదని పికె చెప్పినట్టు వింటూ బోర్లా పడుతున్నాడనీ, ప్రశాంత్ కిషోర్ ఉత్తరాది రాజకీయాలకి పనికొస్తాడు కానీ దక్షిణాదికి కాదనీ – ఇలా ఎన్ని డైమెన్షన్స్ కి అవకాశం ఉంటే అన్నిరకాల చర్చలూ నడుస్తున్నాయి, టివిల్లో, సోషల్ మీడియాలో. ప్రశాంత్ కిషోర్ కి చాలా భారీ మొత్తమే ఇచ్చి జగన్ ఆయన్ని 2014 ఎలక్షన్స్ అయిన వెంటనే తనకి వ్యూహకర్తగా నియమించుకున్నాడనీ, ఆ మొత్తం కొన్ని వందల కోట్లనీ రూమర్లు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరొక రకమైన వార్తలు వస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇవి పూర్తయాక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక లో ఏడాది లోపే ఎన్నికలున్నాయి. కానీ ఆశ్చర్యంగా వీటిలో వేటిలోనూ ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీ తరపునా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా కానీ కన్సల్టెంట్ గా కానీ ఆయన పనిచేయడం లేదు. ఇంకోరకంగా చెప్పాలంటే, వారెవ్వరూ ఈయన సలహాలు తీసుకోవడానికి కానీ ఈయన్ని వ్యూహకర్తగా నియమించడం కానీ చేయలేదు. ఒక మూడేళ్ళ క్రితం వరకూ, ప్రశాంత్ కిషోర్ చుట్టూ క్యూ లు కట్టిన పార్టీలు ఇప్పుడు ఆయన్ని లైట్ తీసుకుంటున్నాయి.
అయితే ప్రశాంత్ కిషోర్ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) కి చెందిన ఉద్యోగులు మాత్రం, పంజాబ్ లో విజయం సాధిస్తే ఆ క్రెడిట్ స్థానిక నాయకులు తీసుకుని, ఓడిన ఉత్తర ప్రదేశ్ లో మాత్రం ఆ ఓటమి ని తమకి అంటగట్టడం భావ్యం కాదని వాపోతున్నారు. ఇలాంటి వాటివల్లే ఒకప్పుడు 200 మంది ఉద్యోగులు ఉన్న తమ సంస్థ లో ఇప్పుడు కేవలం 50 మంది మాత్రమే ఉన్నారనీ, ఇప్పుడు ఎపి లోని వైసిపి తప్ప వేరే ఏ పార్టీ తమకి క్లయింట్ గా లేదనీ అంటున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ ని ముఖ్యమంత్రిని చేయడానికి ఇప్పటికే “రావాలి జగన్, కావాలి జగన్” లాంటి స్లోగన్స్ తయారు చేసి, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం లో ఉన్నాడని వారంటున్నారు.
ఇక, ప్రశాంత్ కిషోర్ కి వేరే ఏ ప్రాజెక్టులూ లేకపోతే పూర్తిగా వైసిపి మీదే కేంద్రీకరించి జగన్ ని ముఖ్యమంత్రిని చేస్తాడని జగన్ అభిమానులు వాదిస్తుంటే, దేశం లోని అన్ని పార్టీలూ ప్రశాంత్ కిషోర్ సత్తా తెలుసుకుని ఆయన్ని దూరం పెడితే జగన్ కి మాత్రం ఇప్పటికీ తెలీలేదని ఇతర పార్టీల అభిమానులు వాదించుకుంటున్నారు. ఏది ఏమైనా, ఈ రాష్ట్రాల ఎన్నికలలో ఏ పాత్రా లేని ప్రశాంత్ కిషోర్ మరి 2019 సార్వత్రిక ఎన్నికల టైం కి ఎవరి హస్తం కిందకి వెళతాడో, లేక ఎవరికి నమోః అంటాడో లేదంటే నెమ్మదిగా రాజకీయ యవనిక నుంచే తెరమరుగవుతాడో చూడాలి.