జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా స్వయంగా జగనే అన్ని మీడియాలని మంచి కవరేజ్ ఇవ్వమని అభ్యర్థించారు. అయితే ఆ మీడియాల సంగతి ఎలా ఉన్నా సాక్షి మాత్రం ఫుల్ ఫోకస్ అంతా ఈ పాదయాత్ర పైనే ఉంచింది. వీలైనన్ని కథనాలు వ్రాస్తోంది. అయితే వీటిలో భాగంగా సాక్షి – మరి తెలిసో తెలియకో – కొన్ని పొరపాట్లు చేస్తోంది. ఇవాళ , రాజన్న రాజ్యం రావాలంటూ సాక్షి లో వ్రాసిన కథనం లో, ఇలా చెప్పుకొచ్చారు –
” (ఇప్పుడు ) కరెంటు బిల్లు కట్టలేక ఒక్క రోజు ఆలస్యం అయితే వంద రూపాయలు అదనంగా కట్టించుకుంటున్నారు. ఆ మహానుభావుడు వైఎస్ ఎక్కడున్నాడో… ఆయన ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టమని వచ్చి అడిగేవారు లేరు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో నివాసాలకు మీటరు తగిలించిన వారు లేరు. అలాంటిది నాలుగేళ్లలో అడుగు తీసి అడుగుపెడితే డబ్బులు తియ్యాల. అంతెందుకు నా ఈ మోటారు బైకు రోడ్డుపైన తిరగాలంటే జేబులో ఐదొందలు లేనిదే తిరిగి ఇంటికి రాలేని పరిస్థితి. లైసెన్స్ లేదని వంద, హెల్మెట్ లేదని మరో వంద, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలు. వీటన్నింటికీ తోడు జీఎస్టీ అంట. ఏందయ్యా ఈ బాధలు. ఇన్ని బాధలు పడుతున్నోడు ఎవడైనా ఈ చంద్రబాబుకు ఓటేస్తారా? ” అని రైతులు, రైతు కూలీలు అన్నట్టు సాక్షి లోవ్రాసారు.
ఇదీ ఆ కథనం. పేదలకి అండగా ఉండటమే రాజన్న రాజ్యం అనే చెప్పే ఉద్దేశ్యం మంచిదే అయినా, రాజన్న రాజ్యం అంటే, హెల్మెట్, లైసెన్స్ లేకుండా బైక్ నడిపినా ఎవరూ అడగరని, కరెంట్ ఎంత వాడినా బిల్లులు కట్టాల్సిన పని ఉండదని, బిల్లులు కట్టమని ఎవరూ అడగరాని, అసలు మీటర్ లేకుండానే ఇళ్ళకి కరెంట్ వచ్చేదని రైతులు, రైతు కూలీలు అన్నట్టు అదే రాజన్న రాజ్యం అంటే అని నిర్వచించినట్టు అనిపిస్తోంది ఈ కథనం చూస్తే. జగన్ కి పేదల్లో, రూరల్ లో బాగానే ఆదరణ ఉన్నప్పటికీ మిడిల్ క్లాస్ లో అప్పర్ మిడిల్ క్లాస్ లో తీవ్ర వ్యతిరేకత ఎందుకు ఉంటుందో అన్న సందేహానికి మరొక రకంగా ఈ సాక్షి కథనమే సమాధానమిస్తోంది. ఎందుకంటే, మీటర్ లేకుండా కరెంటు , బిల్లులు కట్టకుండా కరెంటు ఎవరైనా వాడుతుంటే, చివరికి ఆ భారం మోసేది ప్రజలే. ఎవరైతే బిల్లులు సక్రమంగా కడుతూ ఉంటారో (మిడిల్ క్లాస్ ) వారి మీద ఛార్జీలు పెంచడం ద్వారా ఈ లోటు ని ప్రభుత్వం పూడ్చుకుంటుంది. అంటే రాజన్న రాజ్యం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయాన్ని మిడిల్ క్లాస్ లో కలిగిస్తోంది సాక్షి కథనం.
నిజంగా బాగా వ్రాయాలి అనుకుంటే వైఎస్ కట్టిన ప్రాజెక్టుల గురించి ఆరోగ్యశ్రీ లాంటి పథకాల గురించి, 108 లాంటి వాటి గురించి హైలెట్ చేసి రాజన్న రాజ్యం అంటే ఏంటనేది నిర్వచించవచ్చు. కానీ ఎప్పటిలాగే సాక్షి “ఎమోషన్స్ ” కి ప్రాధాన్యత ఇచ్చి, “లాజిక్” ని గాలికొదిలేసి బోల్తా పడుతోంది. మరి ఇప్పటికైనా సాక్షి బృందం తప్పు దిద్దుకుంటుందా లేక ఇదే మూస లో కొనసాగుతుందా?