సైరా నరసింహారెడ్డిని టెన్షన్లో పెట్టిన విషయం కెమెరామెన్ మార్పు. ఈ సినిమాకి క్లాప్ కొట్టినప్పుడు రవి వర్మన్ని కెమెరామెన్‌గా అనుకొన్నారు. సెట్ల విషయంలో ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు కూడా. అంతా ఓకే అనుకొంటున్న తరుణంలో రవి వర్మన్ టీమ్ నుంచి తప్పుకొన్నారు. అతని స్థానంలో రత్నవేలు వచ్చి చేరారు. అయితే రత్న వేలుని ఒప్పించడానికి సైరా టీమ్ చాలా కష్టపడాల్సివచ్చింది. రత్నవేలుకి వేరే ఆఫర్లు చాలా ఉన్నాయి. ఆయన దర్శకత్వం వైపు కూడా దృష్టి పెట్టారు. 2018లో ఓ సినిమా చేద్దామని ఆయన స్క్రిప్టు రెడీ చేసుకొన్నారు కూడా. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు. రంగస్థలం కూడా తన మిత్రుడు సుకుమార్ కోసం ఒప్పుకొన్నదే. రంగస్థలం తరవాత పూర్తిగా దర్శకత్వం వైపే దృష్టి పెట్టాలని నిర్ణయించుకొన్నారు. అయితే.. చిరంజీవి ప్రత్యేకంగా రత్నవేలుని కలిసి, టీమ్‌లో చేరమని అడగడంతో రత్నవేలు కాదనలేకపోయినట్టు తెలుస్తోంది. అంతే కాదు, ఈసినిమా కోసం భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశార్ట. సాధారణంగా రత్నవేలు రెమ్యునరేషన్ రూ.3 నుంచి రూ.4 కోట్ల మధ్యలో ఉంటుంది. ఈ సినిమా కోసం రూ.5.5 కోట్లు ఇస్తామని చెప్పడంతో రత్నవేలు కూడా కాదనలేకపోయాడని టాక్. అయితే.. ‘వీలైనంత త్వరగా ముగించాలి..’ అన్న కండీషన్ మాత్రం రత్నవేలు నుంచి వచ్చిందని సమాచారం. సినిమా లేట్ అవుతూ ఉంటే.. ఆయన కూడా చివర్లో హ్యాండిచ్చే ప్రమాదం కనిపిస్తోంది.