రైతు సమన్వయ సమితుల చర్చ మొదలైన నాటినుంచి టిఆర్ఎస్ రాజకీయ పట్టు పెంచుకోవడానికే దారితీస్తాయని విమర్శలు బలంగా వినిపించాయి. రైతులకు తామిచ్చే ఆర్థిక సహాయం సరైన వారికి చేరడానికి, పంటల పొందిక మార్పులో శాస్త్రీయ సూచనలు చేయడానికి మాత్రమే ఈ సమితులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతూ వచ్చినా ఎవరూ నమ్మలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ నోరు విప్పలేదు గనక మిగిలిన వారు కూడా ఏవో సమర్థనలతో దాటేస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు శాసనసభలో ఈ విషయమై కెసిఆర్ కుండబద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ నేతలు పదవులు అనుభవిస్తుంటే తెలంగాణ కోసం పోరాడింది తమ కార్యకర్తలే గనక వారికి ఈ సమితుల సారథ్యం అప్పగించడంలో తప్పేం లేదు పొమ్మన్నారు. తెలుగుదేశం రైతు మిత్రలనూ కాంగ్రెస్ ఆదర్శ రైతులను కూడా గుర్తు చేశారు.అప్పట్లో వైఎస్,ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాటి వాదనలే చేస్తున్నారు. మా కార్యకర్తలు చెప్పే పనులు చేయాలని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చెప్పడం రెండేళ్ల కిందట పెద్ద సంచలనం. జన్మభూమి కమిటీల పేరిట తెలుగుదేశం నాయకుల సిఫార్సులుంటేనే పని చేస్తున్నారని కూడా అనేక ఫిర్యాదులొచ్చాయి. చివరకు ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో చెబుతున్న రైతు సమన్వయ సమితులు అందుకు భిన్నమైనవి కాబోవని అందరికీ అర్థమైంది. ఆ విషయమే సూటిగా నిస్సంకోచంగా చెప్పేసిన కెసిఆర్‌ను ఒక విధంగా అభినందించవచ్చు. అయితే ఆయన సహజంగా గత పాలకులపై చేసే విమర్శలలో ఒక వైరుధ్యముంటుంది. పాలనా వ్యవహారాలు వచ్చినప్పుడు సమైక్య పాలకులపై నిప్పులు చెరుగుతారు. అదే స్వంత రాజకీయ వ్యూహాలు వచ్చే సరికి ఇది వరకు చేయలేదా అని వారినే అనుసరిస్తుంటారు. ప్రాంతాలు రాష్ట్రాలు వేరైనా పాలకుల తత్వం ఒకటే కదా…