మొదట బాలయ్య ప్రకటించిన తండ్రి బయోపిక్ ,, తర్వాత రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ రెంటితో పోల్చడానికి లేని లక్ష్మీస్ వీరగ్రంధం.. మొత్తంపైన మహానటుడు మాజీ ముఖ్యమంత్రి జీవిత కథపై జుగుప్సాకరమైన రచ్చకు కారణమైనాయి. బాలయ్య చిత్రం ప్రకటించినప్పుడు నేను లక్ష్మీ పార్వతితో సహా చర్చలలో పాల్గొన్నాను. బాగా తీయాలని ఆశించాను. లక్ష్మీ పార్వతితో పెళ్లి చంద్రబాబు నాయుడు తిరుగుబాటు వంటి అంశాలపై అతిగా చర్చ అనవసరమనీ, ఆయన జీవితం దానికంటే ఎంతో విశాలైనదనీ విలువైనదనీ స్పష్టం చేశాను. ఆ దశలో ఆమె కూడా చిత్ర నిర్మాణానికి పెద్ద సానుకూలంగా లేరు. ఏదైనా తప్పుగా తీస్తే కోర్టుకు వెళతానన్నట్టు మాట్లాడేవారు. తర్వాత హఠాత్తుగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ పేరే వివాదాస్పదం. దానికి వేసిన పోస్టరు కూడా ఆయనకు ఆమె అండగా వున్నట్టు చెబుతుంది. అయితే ఆ భాగానికే పరిమితమవుతానని వర్మ చెప్పడంతో అంతా శాంతించారు. ఆమె మాత్రం సంతోషంగా ప్రోత్సహించారు. అంటే తన పాత్ర ఎలా వుంటుందనే దానిపైనే ఆమె స్పందన తప్ప ఎన్టీఆర్ ప్రతిష్ట ఎలా కాపాడాలనేది ప్రధాన సమస్య కాకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే నేను ఆమెను చాలా వివరంగా ఇంటర్వ్యూ చేశాను కూడా. ఎన్టీఆర్‌కు మీరు అండ తప్ప మీకు ఎన్టీఆర్ ఇచ్చిన అండ గురించి మాట్లాడకపోవడం సరైందేనా అని కూడా అడిగాను. పైగా మీరే చొరవగా ఆయనతో అనుబంధం పెంచుకోవడం ఎలాటి పరిణామాలకు దారితీస్తుందో వూహించలేదా అని అడిగితే ఆమె అదెలా సాధ్యమని ఎదురు ప్రశ్న వేశారు. ఇంతలోనే చెన్నై తెలుగు నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంధం చిత్రం తీస్తానని ప్రకటించారు.వర్మ టైటిల్ వివాదాస్పదమనుకుంటే ఇది వికృతంగా వుంది. వేసిన పోస్టరు కూడా ఆమెను అవమానించే రీతిలో తయారైంది. సహజంగానే దీనిపై లక్ష్మీపార్వతి నిరసన తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్‌లో షూటింగు ప్రారంభాన్ని పోలీసులు నిరోధించారు గాని ఎలాగో ముగించారు. విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లాడిన మహిళ పాత భర్త గురించి నాటి జీవితం గురించి ప్రత్యేకంగా తీయడం,ఆమె పాత్రను హీనంగా చూపించేలా పోస్టర్లు వేయడం ముమ్మాటికి తప్పే. అది ఎన్టీఆర్‌కూ మర్యాద కాదు. కాని నిజాలు బయిటకు రావాలని టిడిపి అధికార ప్రతినిధులు చర్చలలో మాట్లాడ్డం వెగటు పుట్టిస్తుంది. అయతే ఆమె వర్మ చిత్రాన్ని ఉత్సాహంగా స్వాగతించడం కూడా విమర్శా పాత్రమే. ఎందుకంటే ఆ ఒక్క భాగం మాత్రమే తీసి ఎన్టీఆర్‌ను ఆమె మనిషిగా చూపిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు ఆమోదించడం కష్టం. అందుకే ఈ పాక్షికమైన రాజకీయ ప్రేరితమైన చిత్రాలు కట్టిపెట్టి ఆయన నట రాజకీయ జీవితాన్నిఅంత ఉన్నతంగా విమర్శనాత్మకంగా చిత్రించే సమగ్ర చిత్రం వస్తే అప్పుడే సంతోషం.అంతేగాని 300 సినిమాల మహానటుడిపై చిత్రం వివాదం కావడం విచారకరం.