ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే రాష్ట్రానికి రాబోతున్నారు అన్నారు. త్వరలోనే సభ ఉంటుందన్నారు. ఈ సభలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డికి ఏదో ఒక కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారమూ బాగానే జరిగింది. ఈ నెల 20న వరంగల్ లో సభ ఉంటుందని పీసీసీ వర్గాలే చెప్పాయి. హైకమాండ్ నుంచి ఈ సభకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనీ, ఏర్పాట్లు చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడా సభ గురించి భిన్నవాదనలు ఆ పార్టీ నేతలే వినిపిస్తున్నారు. గడచిన వారం వరకూ సభ ఉంటుందనే కిందిస్థాయి కేడర్ కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ, సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాహుల్ సభ గురించి రాష్ట్ర స్థాయి నేతలు ఎవ్వరూ మాట్లాడటం లేదట! దీంతో కార్యకర్తల్లో కొంత గందరగోళం నెలకొందని తెలుస్తోంది. రాహుల్ త్వరలోనే వస్తున్నారని ప్రకటించడం, ఆయన రాక వాయిదా పడటం అనేది ఈ మధ్య తరచూ ఎందుకు జరుగుతోందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
అక్టోబర్ చివరి వారంలో రాహుల్ రాష్ట్రానికి రాబోతున్నట్టు ఆ మధ్య తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అంతేకాదు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక ముందుగా ఆయన తెలంగాణకు వస్తారని అన్నారు. దానికో సెంటిమెంట్ కూడా జోడించారు! అయితే, రాష్ట్ర నేతలు ఆశించినట్టుగా జరగలేదు. రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించే కార్యక్రమాన్ని సోనియా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, త్వరలోనే గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఫలితాలు వచ్చిన తరువాతే పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో ఆమె ఉన్నారని కూడా కథనాలు వచ్చాయి. దీంతో తెలంగాణ పర్యటన అప్పటికి రద్దయిపోయింది. అయితే, నవంబర్ 9వ తేదీన వరంగల్ లో సభ ఉంటుంది అన్నారు. ఈలోగా పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చి చేరడంతో కాస్త హడావుడి నెలకొంది. ఇదే సమయంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ బిజీబిజీగా ఉన్నారు. ఫలితంగా ఈ తేదీ కూడా మారిపోయింది. తాజాగా 19 లేదా 20న రాహుల్ వస్తారని ఆ పార్టీ నేతలే చెప్పినా… ఇప్పుడు మళ్లీ ఆయన రాకపై కొంత గందరగోళం నెలకొంది.
ఇంతకీ రాహుల్ రాష్ట్ర పర్యటన ఎందుకు వాయిదా పడుతోంది..? తెలంగాణ నేతలు చెబుతున్నట్టుగా గుజరాత్ ఎన్నికలే కారణమా..? నిజానికి, గుజరాత్ ఎన్నికలు అనేవి హఠాత్తుగా వచ్చినవి కాదు కదా! కాబట్టి, ఆ ఎన్నికలు కారణంగానే ఎప్పటికప్పుడు రాహుల్ రాక వాయిదా పడుతోందనడం సరైన కారణంగా కనిపించడం లేదు. రాహుల్ వచ్చాకనే తాజాగా చేరిన రేవంత్ రెడ్డి పార్టీలో క్రియాశీలంగా మారతానే ప్రచారం ఉంది. ఈ లెక్కన రాహుల్ ఎప్పుడొస్తారో తెలీదు. ఎందుకు రావడం లేదో కూడా నేతలు స్పష్టంగా చెప్పడం లేదు. మొత్తానికి, రాహుల్ పర్యటన పేరుతో కిందిస్థాయి కార్యకర్తలు కొంత గందరగోళానికి గురౌతున్నది వాస్తవం. రాహుల్ వస్తే రేవంత్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తారు కాబట్టి, కొన్నాళ్లపాటు ఆయన పర్యటన వాయిదా పడితే మంచిది అనుకునేవారు ఎవరైనా తెర వెనక చక్రం తిప్పుతున్నారా అనే అనుమానాలకూ ఆస్కారం ఉందిక్కడ!