పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తి చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే, వారానికోసారి సమీక్ష చేస్తున్నారు. ఇంకోపక్క, ఈ మధ్య ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా పోలవరం నిధుల గురించే మాట్లాడి వచ్చానని చెబుతున్నారు. అయితే, ఇప్పుడున్న అంచనాల ప్రకారం చంద్రబాబు పెట్టుకున్న లక్షిత సమయానికి పోలవరం పనులు పూర్తిచేయడం అనేది సవాలే. ఈ ప్రాజెక్టు విషయమై ఏపీ సర్కారు వాణి ఈ మధ్య కాస్త మారిందనే చెప్పాలి! కాపర్ డామ్ విషయంలోనూ, జలవిద్యుత్ కేంద్రం అంశంలోనూ, డిజైన్ల ఫైనలైజ్ వ్యవహారంలోనూ ఆశించిన స్థాయిలో కేంద్ర సర్కారు సహకారం అందడం లేదనే వాదనను వినిపిస్తున్నారు. నిజానికి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని కొన్ని పనుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గట్కరీ ఈ ప్రతిపాదనకు అడ్డుపడ్డారు! అక్కడి నుంచే టీడీపీ స్వరంలో మార్పు వచ్చింది. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలోపు పూర్తి కాకపోతే.. దానికి కేంద్రం వైఖరే కారణం అని చెప్పేందుకు కావాల్సిన నేపథ్యాన్ని సిద్ధం చేసి పెట్టుకుంటోంది.
అయితే, ఈ ప్రయత్నం భాజపాకి అర్థం కాకుండా ఉంటుందా చెప్పండీ..! వారు కూడా ఒక ముందస్తు జాగ్రత్త వాదనను సిద్ధం చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా కొంత తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం అంశమై కేంద్రమంత్రి నితిన్ గట్కరీతోపాటు ప్రాజెక్టు ప్రత్యేక కార్యదర్శితో నేతలు భేటీ అయ్యారు. కేంద్రంతో సరైన విధంగా సంప్రదింపులు జరిపితే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యే అవకాశమే లేదన్నారు ఏపీ భాజపా నాయకురాలు పురందేశ్వరి. కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని కేంద్రం ఎప్పుడూ వ్యతిరేకించలేదనీ, వద్దని ఏనాడూ అభిప్రాయపడలేదని ఆమె గుర్తు చేశారు. అయితే, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టాలన్నది తమ ఉద్దేశం కాదనీ, రాష్ట్ర నేతలకు పోలవరానికి సంబంధించిన సరైన సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆమె కోరారు. ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక టెక్నికల్ టీమ్ ఇక్కడ లేదనీ, రాష్ట్ర భాజపా నేతల ప్రయత్నంతోనే గతంలో ఓ తొమ్మిది సార్లు కేంద్రం నుంచి ఒక టీమ్ వచ్చి, పనులు పర్యవేక్షించి వెళ్లిందన్నారు. ఈ టీమ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
చంద్రబాబు సర్కారు చేస్తున్న విమర్శల్ని నేరుగా ఖండించకపోయినా.. భాజపా తరఫున వినిపించేందుకు తమ సొంత వాదనను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కేంద్రం తీరు వల్లనే పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని టీడీపీ సర్కారు వాదనగా ఉంటే, రాష్ట్రం సరైన రీతిలో కేంద్రంతో సంప్రదింపులు జరిపితే ఆలస్యం కాదనే వాదనను భాజపా వినిపిస్తోంది. అంటే, ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం సరిగా సంప్రదింపులు జరపడం లేదన్నది చెబుతున్నట్టే కదా! ఏదైతేనేం, పోలవరం మీద ఎవరి వాదన వారికి సిద్ధంగా ఉంది. ఎవరికి క్రెడిగ్ గేమ్ వారిది మరి! సకాలంలో పూర్తయితే తమదే ఆ గొప్పతనం అని ఎవరికివారు చెప్పుకుంటారు. అలా కాకపోతే, ఎదుటివారిపై వేలెత్తి చూపేందుకు ఎవరికివారు సిద్ధంగా ఉన్నారు.